కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై ?
posted on Jun 25, 2024 @ 12:46PM
బిఆర్ఎస్ స్క్రాబ్ కాంగ్రెస్ లో చేరడంపై కరడు గట్టిన కాంగ్రెస్ వాదుల నుంచి వ్యతిరేకత వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ ఘోర పరాజయం చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పడం కొందరికి నచ్చడం లేదు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ... తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందన్నారు. తాను రాజీనామా చేశాక పల్లెలన్నీ తిరుగుతానన్నారు.
ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపురాలేదన్నారు. బీజేపీ నుంచి కూడా ఎవరూ సంప్రదించలేదన్నారు. అయినప్పటికీ తనకు పార్టీ మారే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదన్నారు. కానీ ఆ తర్వాత ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానన్నారు.
పార్టీ నుంచి శ్రీధర్ బాబు తనతో మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా మాట్లాడినట్లు చెప్పారు. తాను ఈ స్టేజీలో పార్టీ నుంచి గౌరవం కోరుకున్నానని... కానీ ఈరోజు ఆ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించానన్నారు. తనకు నష్టం కలుగుతుందని తెలిసినా పార్టీ చెప్పిన చోట పోటీ చేశానని వాపోయారు.