కలిసి నడుద్దాం.. కలిసి గెలుద్దాం! దేశం, జనసేన శ్రేణులకు పవన్ పిలుపు
posted on Feb 29, 2024 @ 9:48AM
తెలుగుదేశంతో జనసేనకు పొత్తు ఎందుకు అవసరమో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాడేపల్లి గూడెం సభ వేదికగా విస్పష్టంగా చాటారు. అదే సమయంలో జగన్ కు పరాజయ పరాభవం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టారు. చొక్కాలు మడతపెట్టి, ప్రభుత్వ హింసతో అధికారంలోకి రావాలనుకుంటే జన చైతన్యం ఇంటికి దారి చూపడం ఖాయమని అర్ధమయ్యేలా చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు అన్యాయం జరిగిందంటూ.. మొత్తంగా పొత్తు లక్ష్యానికే తూట్లు పొడిచేలా మాట్లాడుతున్న వారి అసలు ఉద్దేశమేమిటో తన పార్టీ క్యాడర్ కే కాదు, జన బాహుల్యానికి కూడా అర్ధమయ్యే విధంగా జగన్ వివరించి చెప్పారు. జగన్ పాలనలో అధ్వానంగా మారిన రాష్ట్రం తిరిగి గాడిన పడి అభివృద్థి పథంలో దూసుకుపోవాలంటే చంద్రబాబులాంటి విజనరీ, ప్రజా సంక్షేమం పట్ల, ప్రగతి, అభివద్ధి పట్ల స్పష్టమైన అవగాహనే కాకుండా, చిత్తశుద్ధి, సంకల్పం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తీరాలని చెప్పారు. కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చేద్దామని కలలు కంటూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడానికి సిద్ధం అంటూ వాలంటీర్లతో సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న జగన్ కు తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం తప్పిన కౌరవసేన ఎలా మట్టి కరిచిందో జగన్ కు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యేలా చేసింది.
ఇక పొత్తులో భాగంగా జనసేనకు తీరని నష్టం జరిగిందంటూ జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని ఈ సభ ద్వారా అత్యంత ప్రతిభామంతంగా తిప్పి కొట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్. అసలు దేశంలో పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించిన చంద్రబాబు ఈ సభ ద్వారా పొత్తు ధర్మాన్ని ఎలా పాటించాలి, అరమరికలు లేకుండా ఎలా ముందుకు సాగాలి అనేది తమ తమ పార్టీల నేతలకు, క్యాడర్ కు బలంగా చాటారు. సభలో ఒకరికి ఒకరు ఇచ్చుకున్న గౌరవం, ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ రీతి సమన్వయం వైసీపీ క్యాడర్ కూడా విస్తుపోయేలా చేసింది. తమ ఎత్తులు ఇక పారవన్న విషయాన్ని కూడా వారికి తేటతెల్లమయ్యేలా చేసింది.
రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ చేసిన త్యాగాన్ని చంద్రబాబు, అదే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు పడ్డ కష్టాన్ని, శ్రమను పవన్ ప్రస్తావించి ప్రశంసించిన తీరు.. ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలు లేవనీ, నేతల మధ్య అరమరికలు లేవనీ చాటింది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీ పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుదామా? సంస్థాగతంగా అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీకి.. సంస్థాగతంలో బలం లేని జనసేన పోటీ పడగలదా? ప్రతి నియోజకవర్గం లోనూ మనకు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారా? అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో జనసేనకు 24 సీట్లేనా అంటున్న వారిని ప్రశ్నించి నిలదీశారు. జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. మనం సంస్థాగతంగా బలోపేతమయ్యేలోపు వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అలా జరగకూడదు కాబట్టే.. మనకు తెలుగుదేశంతో పొత్తు అవసరం, అనివార్యం అని ధైర్యంగా పవన్ కల్యాణ్ చాటారు. ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ షిప్ అవసరం. ఆయన అయితేనే వైసీపీ పాలనతో అన్ని విధాలుగా అధ్వాన స్థితికి చేరుకున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరు అని చెబుతూ చంద్రబాబు గొప్పతనం గురించి అలిపిరి వద్ద ఆయనపై జరిగిన క్లైమోర్ దాడి తరువాత చంద్రబాబు ప్రదర్శించిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని గుర్తు చేశారు.
చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలోనే క్లైమర్ మైన్ తో ఆయన వస్తున్న జీప్ పై తిరుపతిలో దాడి జరిగి ఆ జీప్ 16 అడుగులు ఎత్తున లేచింది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన ఆ జీపు శిథిలాల మధ్య నుంచి లేచి చొక్కా దులుపుకుని పదండి రాజకీయం చేద్దామని నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న దురంధరుడు చంద్రబాబు అంటూ ప్రస్తుతించారు. అటువంటి నాయకుడితో కలిసి ముందుకెళ్లడం ఎప్పటికీ తప్పు నిర్ణయం కాదు. ఇప్పటి సీఎం గా ఉన్న జగన్ పరదాలు కట్టుకుని, చెట్లు నరికించి తనకు ఓట్లేసి ప్రజల మధ్యకు వస్తుంటే బాబు మాత్రం తన పై జరిగిన దాడిని కూడా లెక్కచేయకుండా ప్రజాసేవకై అడుగు ముందుకు వేసారు. తన ప్రత్యర్థుల మీదకు చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ తన సైన్యానికి హింట్ ఇస్తున్న నాయకుడ్ని ఇప్పటి తరం చూస్తుంటే తనపై క్లైమోరే మైన్ తో దాడి జరిగినా.. చొక్కా దులుపుకుని రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేసిన నాయకుడిని ఆ తరం చూసిందంటూ బాబు పై జరిగిన దాడి గురించి, రాజకీయాల మీద ఆయనకు ఉన్న ఆసక్తి, ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం, నిబద్దత గురించి నిండు సభలో చెప్పి బాబు అభిమానులలోనే కాదు, జనసైనికులలోనూ ఉత్తేజం ఉత్సాహం నింపారు. జనేనాని ప్రసంగం వేదిక మీద ఉన్న చంద్రబాబునీ, నేతలనే కాదు.. సభకు హాజరైన లక్షలాది మందినీ ఒక్కసారిగా ఉద్వేగానికి గురి చేసింది. జగన్ పార్టీ పరాజయాన్ని ఈ సభ సక్సెస్ ఖరారు చేసేసిందని పరిశీలకులు అంటున్నారు.