మన బలం ఇదే.. పొత్తు అందుకే.. ఎనీ డౌట్.. జనసైనికులకు క్లారిటీ ఇచ్చేసిన పవన్
posted on Feb 29, 2024 @ 10:21AM
24 సీట్లేనా..! చంద్రబాబు వద్ద పవన్ జనసైనికులను తాకట్టు పెట్టారు.. పవన్ అసలు రాజకీయ నాయకుడేనా?, పొత్తులో భాగంగా ఇన్ని తక్కువ సీట్లకు ఒప్పుకుంటారా? ఇవీ గత మూడు రోజులుగా అధికార పార్టీ వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై చేస్తున్న విమర్శలు.. పనిలో పనిగా జనసైనికులనూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. సొంత ఇల్లు చక్కబెట్టుకోండయ్యా బాబు అంటే.. అది మానేసి పక్కింట్లో ఏం జరుగుతుందో తొంగి చూడటం వైసీపీ నేతలకు బాగా అలవాటైపోయింది.. వైసీపీ నేతలకు ప్రజలకు మేలు చేద్దాం ఆనే ఆలోచన కంటే.. తెలుగుదేశం, జనసేన కూటమిలో ఏం జరుగుతున్నదో చూడటం, అందుకు తగ్గట్లు విమర్శలు చేయడమే టాస్క్ గా మారిపోయింది. వైసీపీ నేతల విమర్శలు.. పలువురు జనసేన మద్దతుదారుల ప్రశ్నలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాడేపల్లిలో జరిగిన జనసేన, తెలుగుదేశం ఉమ్మడి బహిరంగ సభలో సమాధానం ఇచ్చారు.
పవన్ ప్రసంగం మొత్తం చూస్తే.. ఆవేశం, ఆలోచనల మేలు కలయికగా అనిపించింది. ఆయన ప్రసంగం తీరులో మార్పు కనిపించింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న ప్రతీ అంశాన్ని పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేసిన పవన్, జనసేన మద్దతుదారులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు.. మరోవైపు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానంగా పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. 24 సీట్లేనా అని వైసీపీ విమర్శలు చేస్తుంది.. 24 సీట్లతో మమ్మల్ని ఏం చేస్తావని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలిసింది.. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు అంటూ జనసేనాని సవాల్ చేశారు.
పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన మద్దతుదారులకు కూడా పవన్ చిన్నపాటి క్లాస్ పీకారు. జనసైనికులూ నన్ను నమ్మండి.. నాకు వ్యూహం ఉంది. పదేళ్లుగా కష్టపడుతున్నాం.. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. జనసేనకు తెలుగుదేశం తరహాలో క్షేత్రస్థాయిలో పూర్తి బలం లేదు. ఇప్పుడిప్పుడే అన్నింటినీ సమకూర్చుకుంటున్నాం. కోట కూడా కడతాం.. జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాం.. సలహాలు ఇచ్చేవాళ్లు నాకు అక్కర్లేదు. నన్నునమ్మి నాతో యుద్ధం చేసేవాళ్లే నా వాళ్లు అంటూ.. జనసేన సానుభూతి పరులకు పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి పవన్ చాలా గొప్పగా చెప్పారు. రాజకీయ దురంధరుడుగా అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారని పవన్ కొనియాడారు.
మొత్తానికి తాడేపల్లిలో జరిగిన జనసేన , తెలుగుదేశం కూటమి భారీ బహిరంగ సభ జనసైనికులు, తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇరు పార్టీల అధినేతలు రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం అంటూ సభావేదికగా ప్రజలకు క్లారిటీగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధికోసం, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జనసేన, తెలుగుదేశం పొత్తు అంటూ స్పష్టం చేశారు. బహిరంగ సభ విజయవంతం కావడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలాంటి ఇగోలకు పోకుండా మేమిద్దరం ఒకటే అంటూ చాటిచెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జనసైనికులు, టీడీపీ శ్రేణులు ఇలానే కలిసిపనిచేయాలని సూచించారు. దీంతో జనసేన , టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి చిచ్చుపెడుతున్న వైసీపీ నేతల వ్యూహాలకు చంద్రబాబు, పవన్ ఈ సభ ద్వారా చెక్ పెట్టినట్లైంది.