లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా!
posted on Jun 25, 2024 @ 2:49PM
పవన్ కల్యాణ్ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అనే డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అలాంటి కిక్కే పవన్ కల్యాణ్ అనుభవంలకి వచ్చిందని చెప్పవచ్చు. గత ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత.. ఇప్పుడు వందశాతం స్ట్రైక్ రేట్ తో తన పార్టీ జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా విజయం సాధించడమే కాకుండా తాను స్వయంగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. మరో వైపు గత ఐదేళ్లుగా తనను టార్గెట్ చేసి వ్యక్తిగత జీవితంపై విమర్శలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వైసీపీ నేతలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుండా, స్వయంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా మామూలు ఎమ్మెల్యేగా మిగిలారు. వ అధికారంలో ఉన్నన్ని రోజులు పాలన మీద కన్నా ప్రతిపక్షాలపై వేధిపులు, ప్రతిపక్ష నేతలపై బురద జల్లుడే ఏకైక కార్యక్రమంగా సాగిన జగన్ పాలనకు జనం తమ ఓటుతో చరమగీతం పాడారు.
దీంతో ఇప్పుడు జగన్ బెంగళూరులో మకాం వేసి.. కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. అడపాదడపా తన ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగులే అనీ, తాను గద్దె దిగగానే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందని ట్వీట్లు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇక తాజాగా తాను అసెంబ్లీలో ఇక అడుగపెట్టే అవకాశం క నిపించడం లేదంటూ వస్తున్న వార్తలపై పరోక్షంగా స్పందించారు. అసెంబ్లీలో తమ పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ, అలాగే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలనీ కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖలో తనను సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మంత్రుల కంటే ముందు అనుమతించకపోవడం ద్వారా తొలి రోజే సభాపతి నిబంధనలను పాటించలేదని జగన్ జగన్ ఆరోపించారు. వైసీపీ పట్ల, తన పట్ల అధికార కూటమి సభ్యులు, స్పీకర్ శత్రుభావంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
జగన్ తీరు పట్ల ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు జగన్ ఇలా స్పీకర్ కు లేఖ రాయడాన్ని దుయ్యబడుతున్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో సభలో కూర్చిన జగన్ బేల మాటలను, రాతలను చూస్తూ చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు.