ఎలా పేలుతుందీ రాం‘బాంబు’?
posted on Oct 22, 2012 8:18AM
అన్ని కాన్సెప్టులు ఐపోయినట్టుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అమాంతం జర్నలిజంపై పడిపోయింది. మనకు నచ్చినదైనా, నచ్చకపోయినదైనా సరే, మన నోటినుంచి కాకుండా మరొకరి నోటినుంచి అనిపిస్తే దానికి కొంత విలువ వుంటుందనేది జనాభిప్రాయం. అదే మాటను ఒక జర్నలిస్టు నోటినుంచి అనిపిస్తే మరింత విలువ వుంటుందని జనాల గుడ్డి అభిప్రాయం.
సినిమా విషయానికి వస్తే... అందులో అభ్యంతరకర సన్నివేశాలు వున్నాయని ఆక్షేపణ. అసలు ఏ పాత్రా దొరకనట్టు పవన్‌కళ్యాణ్ జర్నలిస్టు పాత్ర వేయడమే పెద్ద ఆక్షేపణ. దానికి తోడు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ ఒకటి. కెమెరా పట్టుకున్నది గంగ అయితే కెమెరా వుమెన్ అనో, కెమెరా పర్సన్ అనో అనాలి కదా!? తెలుగు భాష ఎప్పుడో తగలడిపోయింది కాబట్టి దాని సంగతి వదిలేద్దాం. తగలడిపోయిన తెలుగుభాషలాగానే తెలుగువారి మధ్య ఐక్యత కూడా అంతగానే తగలడిపోయింది. ఐక్యత, సమైక్యత అనేవి తెలుగు నేలలో ఇప్పుడు బూతుపదాలు. విభజన, విచ్ఛిన్నత అనేవి పవిత్ర పదాలు. ఈ విభజనపు పవిత్ర పదాల ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమాకు అనేక నంది అవార్డులు లభించాయి... చివరికి జాతీయ సమైక్యతా అవార్డు సహా!
ఒకే తెలుగుజాతి మధ్య అంతరాలు వున్నాయని చాటింపు వేసిన సినిమాకు జాతీయ సమైక్యతా అవార్డు దక్కితే, అదే తెలుగుజాతి వేర్వేరు కాదు.. సమైక్యం, సమాఖ్యం అని చాటిచెప్పే సినిమాకు ఎన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాలి? కర్ర వున్నవాడిదే బర్రె అన్న చందంగా నోరున్నవాడిదే రాజ్యంగా చెలామణి అయిపోతోంది. ఏది ఏమైనా సినిమాలు సాంస్కృతిక సాధనాలు. అవి బాగుంటే జనం ఆదరిస్తారు. లేదంటే ఛీత్కరిస్తారు. సమాజ హితానికి చేటు చేసే అంశాలు లేకుండా చూడడమే సెన్సార్ బోర్డు లక్ష్యం తప్ప రాజకీయ అంశాలు లేకుండా చూడడం కాదు. ఒక ప్రాంతంవారి మనోభావాలు దెబ్బతినేలా వున్నాయని సాంస్కృతిక శాఖ మంత్రి తీర్మానించి, సూపర్ సెన్సార్ కమిటీని నియమించడం సమంజసం కాదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనేక సినిమాలు వచ్చాయి. అనేక పాటలు, కళారూపాలు ప్రచారంలో వున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇలాగే సూపర్ సెన్సార్ కమిటీలు వేస్తారా మరి?