అజార్ మీద చేయి పడనీయం – పాక్!
posted on Jan 26, 2016 @ 11:13AM
భారతదేశం యావత్తునీ కుదిపేసిన పఠాన్‌కోట్ దాడి మీద పాకిస్తాన్ మరో సారి తన ద్వంద్వ నీతిని ప్రదర్శించింది. తొలుత ప్రపంచదేశాల ఒత్తిడికి తల ఒగ్గిన పాక్, పఠాన్‌కోట్ నిందుతుల తమ దేశంలోనే ఉంటే తప్పక దండిస్తామని చెప్పింది. పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న జైష్-ఏ-మహమ్మద్ నాయకుడైన మసూద్ అజారే ఈ దాడులకి సూత్రధారి అని భారత్ తేల్చిచెప్పడంతో పాకిస్తాన్‌కి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. తుపాకుల దగ్గర నుంచి, పాదరక్షల దాకా పఠాన్‌కోట్ వద్ద దొరికిన వందలాది సాక్ష్యాలన్నీ తన వైపు వేలెత్తి చూపడంతో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడింది. చివరికి తప్పనిసరి పరిస్థితులలో మసూద్ అజార్‌ను అరెస్టు చేశామని పాకిస్తాన్ ప్రకటించినా, ఆ దేశపు చర్యల గురించి రక్షణ నిపుణులు సందేహాస్పదంగానే ఉన్నారు. అందుకు తగినట్లుగానే పాక్ ఆ తరువాత మాట మార్చింది. అజార్‌ను అరెస్టు చేయలేదు, కేవలం పారిపోకుండా నిఘా ఉంచాం అంటూ సెలవిచ్చింది. ఇప్పుడు మరో మెట్టు కిందకి దిగి అజార్‌ను ప్రశ్నించేందుకు భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పేసింది. మరో వైపు ఇండియా పఠాన్‌కోట్ సంఘటనను దేశ ప్రతిష్ఠకు సవాలుగా భావిస్తోంది. మసూద్ అజార్‌ను అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్‌ను ఎలాగైనా దేశానికి రప్పించి శిక్షించాలన్న పట్టుదలతో ఉంది. మసూద్ అజార్ జైష్-ఏ-మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థను స్థాపించి భారతదేశపు పార్లమెంటు మీద దాడి మొదల్కొని ఇప్పటి పఠాన్‌కోట్ దుస్సంఘటన వరకు మన దేశం మీద ఎన్నో దాడులను సాగించాడు. ఈ దాడులకు వెనుక ఉండే ఆలోచన మసూద్ అజార్‌దే అయినప్పటికీ వాటిని అమలుపరిచే బాధ్యత మాత్రం తమ్ముడు అబ్దుల్ రవూఫ్‌దే! మరి వారిద్దరినీ భారత్ శిక్షించగలుగుతుందా? లేకపోతే మరిన్ని దాడులకు సిద్ధపడాల్సి ఉందా? అన్నది ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న! ఆ ప్రశ్నకి జవాబు మాత్రం పాకిస్తాన్ దగ్గరే ఉంది.