ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం
posted on Jul 1, 2025 @ 4:02PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ జరిగిన ప్రమాద ఘటనలో విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కంపెనీలో పని చేస్తోన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్‌రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో సోమవారం సిగాచీ ఇండస్ట్రీలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి..... ఎమ్మెస్సీ చదువుకొని పటాన్ చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రెల గ్రామంలో సౌత్ మాలపల్లిలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీ రమ్య.... తిరుపతి పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివింది. నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీ లోనే ఉద్యోగం సంపాదించుకుంది. పిల్లలు ఇద్దరు అత్యంత సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆ యువ జంట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించారు. నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి కొలికపూడి పెళ్లికి ఒప్పించారు. కొద్దిరోజుల తర్వాత రమ్య కుటుంబం జమ్మలమడుగు వెళ్లి నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు. రెండు కుటుంబాల పెద్దలు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుని, ఆషాడ మాసం తర్వాత మంచి ముహూర్తం చూసి పిల్లలకు పెళ్ళి చేద్దామని నిర్ణయానికి వచ్చారు. ఇంతలో ఈ విషాదం ఘటన జరగడం వారి కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి.