జగన్‌రెడ్డికి పార్లమెంట్ టెన్షన్!.. రఘురామతో ముప్పు తప్పదా?
posted on Jul 13, 2021 @ 12:39PM
జులై 19 నుంచి పార్లమెంట్ సెషన్. ఆ తేదీ వినగానే వైసీపీ షేక్ అవుతోంది. పార్లమెంట్ అనే పదం వినిపించగానే జగన్‌రెడ్డికి వర్రీ పెరుగుతోంది. సభలోకి అడుగుపెట్టాలంటేనే వైసీపీ ఎంపీలకు ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఉందంటున్నారు. లోక్‌సభ బెల్ మోగగానే.. తన పరువు ఎక్కడ పోతుందోనని.. యావత్ దేశం ముందు తాను దోషిగా నిలబడాల్సి వస్తుందని జగన్‌రెడ్డి తెగ ఇదైపోతున్నారట. అందుకే, తనకంతటి కష్టం తీసుకురాబోతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును అసలు పార్లమెంట్‌లోకే అడుగుపెట్టనీయకుండా శతవిధాలా ప్రయత్నిస్తోంది వైసీపీ.
రఘురామపై జరిగినట్టు చెబుతున్న థర్డ్ డిగ్రీ ఘటన పార్లమెంట్ ముందుకు రాకుండా చేసేందుకు స్పీకర్ చుట్టూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు ఆ పార్టీ ఎంపీలు. అయినా.. ఫలితం లేకుండా పోతోంది. ఉన్నపళంగా వేటు వేయడానికి అదేమైన పార్టీ అంతర్గత వ్యవహారమా? సభను స్తంభింపజేస్తాం.. అడ్డుకుంటాం.. నిలదీస్తాం.. అంటూ బెదిరించడానికి అదేమైన ఏపీ అసెంబ్లీనా? అందుకే, రఘురామపై వేటు వేయాలంటే దానికో పద్దతి, ప్రాసెస్ ఉంటుందంటూ స్పీకర్ ఓంబిర్లా.. వైసీపీ ప్రయత్నాలకు చెక్ పెట్టారు. దీంతో.. ఇప్పుడేం చేయాలో అర్థంకాని దుస్థితిలో వైసీపీ గగ్గోలుపెడుతోంది.
ఇప్పటికే పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ లేఖలు రాసింది. ఆ పార్టీ ఎంపీలు పలుమార్లు స్వయంగా కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఎందుకు వేయాలని అడిగితే.. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండటం లేదనేది వైసీపీ ఆన్సర్. అయితే, తానెక్కడా హద్దు మీరలేదని.. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేస్తున్నానంటూ రఘురామ చెబుతున్నారు. టెక్నికల్‌గా రఘురామను కార్నర్ చేసే అంశం ఒక్కటీ లేకపాయే. కేవలం, మేం వద్దనుకున్నాం కాబట్టి వేటు వేయాల్సిందే అంటే కుదరదుగా. అందుకు చట్టాలు, నిబంధనలు ఉంటాయిగా. అక్కడే వైసీపీ బుక్కైపోతోంది. రఘురామ రూల్స్ బుక్ ముందేసుకొని మరీ.. ఎక్కడా చిక్కకుండా, దొరక్కుండా.. జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారాయే. దీంతో.. రఘురామపై వేటు అంత ఈజీ కాదు అంటున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చాలా క్లియర్‌గా తేల్చి చెప్పేశారు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామని స్పష్టం చేశారు. రన్నింగ్ కామెంటరీ చేయలేమని, అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ అంటూ ఉంటుందని స్పీకర్ చెప్పారు. ఇక, సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పగా.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందంటూ.. ఏం చేస్తారో చేసుకోమన్నట్టుగా స్పీకర్ మాట్లాడటంతో వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. స్పీకర్‌కే పక్షపాత వైఖరి అంటగట్టిన విజయసాయిరెడ్డికి మైండ్‌బ్లాంక్ అయిపోయింది.
మరోవారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల ఎంపీలకు.. తనపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడి గురించి లేఖలు రాసి.. ఫోటోలు పంపి.. మద్దతు కూడగట్టారు ఎంపీ రఘురామ. ఒక ఎంపీపై జరిగిన దాడిని పార్లమెంట్‌పై జరిగిన దాడిగానే చూడాలని కోరారు. లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఆ అంశం ప్రస్తావనకు వచ్చేలా.. జగన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, వైసీపీలో ఇంతటి టెన్షన్. వారానికోసారి అన్నట్టు స్పీకర్ ఓంబిర్లాను పదే పదే కలుస్తూ.. రఘురామపై వేటు వేయాలని కోరుతూ.. ఒత్తిడి తీసుకొస్తున్నారు వైసీపీ ఎంపీలు. అయితే, రఘురామ పక్కా సాక్షాధారాలతో ఇప్పటికే అన్ని రాజ్యాంగ వ్యవస్థల తలుపుతట్టడం.. స్పీకర్‌ను సైతం కలిసి తనపై జరిగిన దాడిని, కాలి గాయాలను చూపించడంతో.. న్యాయం రఘురామ వైపే మొగ్గు చూపుతోంది. తాను వెల్లడిస్తున్న అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అంటూ రఘురాజు ప్రశ్నిస్తున్నారు. తన పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేయాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ కు కారణం ఏమిటని నిలదీస్తున్నారు. తాను చేసిన తప్పు ఏమిటో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా? అంటూ ఎంపీ రఘురామ రాజు మండిపడుతున్నారు.
ప్రశ్నించడం ప్రజాస్వామ్యం. గొంతునొక్కేయడం నియంతృత్వం. బహిష్కరించడం అప్రజాస్వామ్యం. ఏకంగా.. దాడులకే తెగబడటం రౌడీయిజం. జైల్లో వేసి మనిషినే మాయం చేయాలనుకోవడం దుర్మార్గం. ఇలా రఘురామ విషయంలో జగన్‌రెడ్డి అన్ని పాపాలకూ తెగబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికిపైగా ఎంపీ రఘురామ.. సీఎం జగన్‌కు పంటికింద రాయిలా మారారు. సలహాలు, సూచనలతో జగన్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యారు. రఘురామ టాపిక్ రాకుండా జగన్‌రెడ్డికి రోజైనా గడవటం లేదు. చెవిలో జోరీగలా.. జగన్‌కు నిద్రలేకుండా చేస్తున్నారు. అందుకే, ఆయన వేదన భరించలేక.. రఘురామపై రాజద్రోహం కేసు బనాయించి.. అరెస్ట్ చేసి.. కస్టడీలో ప్రతీకారం తీర్చుకొని.. జైల్లో పర్మినెంట్‌గా సెట్ చేయాలని చూసిందంటూ జగన్ సర్కారుపై బలమైన ఆరోపణలు ఉన్నాయి. గట్టిపిండమైన రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏపీ సర్కారు ఉక్కు పిడికిలి నుంచి బయటపడి.. ఇప్పుడు న్యాయం కోసం దేశ అత్యున్నత చట్టసభలైన పార్లమెంట్‌ను ఆశ్రయిస్తున్నారు. జులై 19న ప్రారంభం కానున్న సభలో తనకు న్యాయం చేయాలంటూ, ఎంపీనైన తనపై దాడి చేసిన జగన్‌రెడ్డి సర్కారును శిక్షించాలంటూ పార్లమెంట్ సాక్షిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు రఘురామకృష్ణరాజు. అందుకే, వైసీపీలో ఇంతటి హైటెన్షన్.