ఉద్యోగుల అవస్థలు.. జీతం అందక తిప్పలు పడుతున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు
posted on Dec 16, 2019 @ 11:31AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 2016 , అక్టోబరు 11 న కొత్త జిల్లాలు.. మండలాలు ఏర్పాటు చేశారు. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలగా మారింది. కొత్తగా 23 జిల్లా పరిషత్ లు 101 మండల పరిషత్ లు ఏర్పాటు చేశారు. కొత్తగా 23 మంది సీవోలు, 23 మంది డిప్యూటీ సీఈవోలు, 101 మంది ఎంపీడీవోలు, 101 మంది మండల పరిషత్ ఆఫీసర్లను నియమించారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లా మండల పరిషత్ ఏర్పాటు బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. కొత్త జడ్పీలు, మండల పరిషత్లు సమస్యల నిలయంగా మారాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, కరకగూడెం, ఆల్లపల్లి మండలాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఏ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి చూసినా నిధుల నుంచి నియామకాల వరకు అన్నీ సమస్యలే కనిపిస్తాయి. కొత్త మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, ఎంఈవో, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు అటెండర్లు ఉండాలి, కానీ స్టాఫ్ నియామకం జరగలేదు. జిల్లా పరిషత్ లోనూ ఇదే పరిస్థితి, కొత్త సిబ్బంది నియామకం పక్కన పెడితే ఉన్న సిబ్బందికి గత రెండు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో జడ్పీ, మండల పరిషత్ ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. జడ్పీ సిబ్బంది నియామకం పై ట్రెజరీకి ఫైల్ పంపక పోవడంతో గత రెండు నెలలుగా జీతాలు రాక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఉద్యోగులు. దసరా, దీపావళికి జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా ప్రభుత్వ కొలువులో ఉండి జీతాలు రాక వెట్టిచాకిరీ చేస్తున్నామని ఉద్యోగులు లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. సమయానికి జీతాలు రాక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అడిగితే ఇబ్బందులు వస్తాయని సర్దుకుపోతున్నారు.