మద్యపాన నిషేధం నామమాత్రమే.. బెల్టు షాపులతో కళకళలాడుతున్న ఏపీ
posted on Dec 16, 2019 @ 11:15AM
కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెల్లో పొరుగు రాష్ర్టాల మద్యం గుప్పుమంటోంది. తుంగభద్ర నది సరిహద్దు ప్రాంతాలైన మంత్రాలయం, కోడుమూరు, కర్నూలుకు తెలంగాణ మద్యం అక్రమంగా సరఫరా అవుతుంటే, పత్తికొండ, ఆలూరు, డోన్ ప్రాంతాలకు కర్ణాటక మద్యం భారీగా దిగుమతి అవుతున్నాయి. ఇక నంద్యాల డివిజన్ లోని చాలా ప్రాంతాల్లో నాటుసారా, కల్తీ కల్లు ఏరులైపారుతోంది. జిల్లా లోని ప్రభుత్వ వైన్ షాపుల్లో మద్యం ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యులు తక్కువ ధరలకు దొరికే మద్యాన్ని కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు అధికార పార్టీ నేతలు వారి అనుచరులు గుట్టుగా బెల్టు షాపుల నిర్వహణకు తెరదీశారు. దీంతో ఊరూరా వాడ వాడలా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుడుతున్నాయి. ఓ వైపు బెల్టు షాపులు నిర్వహిస్తే తాట తీస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న పల్లెల్లో మాత్రం బెల్టు షాపులు యథేచ్ఛగా వెలుస్తున్నాయి.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వివిధ బ్రాండ్ లకు సంబంధించిన మద్యం భారీగా అక్రమ రవాణా అవుతుంది. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. అయినా పొరుగు రాష్ర్టాల నుంచి మోటారు సైకిళ్లు, ఆటోలు, రైళ్లలో మద్యం గుట్టుగా అక్రమ రవాణా జరుగుతూనే వుంది. వాహనాల తనిఖీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్స్ భారీగా పట్టుబడటంపై పోలీసులే షాక్ కు గురవుతున్నారు. మరోవైపు చీప్ లిక్కర్ మాటున కొంత మంది బెల్టు షాపు నిర్వాహకులు కల్తీ మద్యం అమ్మకాలకు తెర తీశారు. దీంతో మందు బాబులు అనారోగ్యం పాలవుతున్నారు. నాటుసారా పల్లెల్లో గుప్పుమంటోంది. అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారవుతుంది. ఇక ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న కొన్ని కళ్లు దుకాణాల్లో తయారయ్యే కల్తీ కల్లు తాగి అమాయకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. క్రిష్ణగిరి మండలంలో ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపుల పై దాడులు నిర్వహించారు. సోదాల్లో పత్తికొండ ఎమ్మెల్యే అనుచరుడు జయపాల్ రెడ్డి మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా తెలంగాణ, కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 110 క్వార్టర్ల కల్తీ మద్యం సీసాలను గుర్తించి సీజ్ చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వారే పొరుగు రాష్ర్టాల మద్యాన్ని దిగుమతి చేసుకొని కల్తీ మద్యాన్ని బెల్టు షాపుల్లో విక్రయించటం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అందులో కల్తీ మద్యం విక్రయాలు జరుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్యం దిగుమతి అవుతూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరిహద్దులపై నిఘా ఉంచి అక్రమ మద్యం సరఫరాను అరికట్టాలని జనం డిమాండ్ చేస్తున్నారు.