ఐటి సోదాల్లో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడడం ఇదే తొలిసారి...

 

కల్కి ఆశ్రమంలో అక్రమాలు బయట పడుతున్నాయి, కల్కి భగవాన్ ముసుగులో జరుగుతున్న దందా లెక్కలు విప్పుతున్నారు ఐటి అధికారులు. బుధవారం నుంచి ఆశ్రమంలోనే ఐటీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు వెయ్యి ఎకరాల భూమి ఉన్నట్టు లెక్క తేల్చారు, దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయల నగదును గుర్తించారు. అందులో తొమ్మిది కోట్ల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు, ఐటి సోదాల్లో ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడడం ఇదే తొలిసారి. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు ముప్పై చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో ఏకంగా ఆశ్రమంలోనే ఐటీ అధికారులు నిన్నటి నుంచి మకాం వేశారు.


వరదయ్యపాలెం మండలం, ఉబ్బలమడుగు, బీఎన్ కండ్రిగ మండలంలోని కల్కి ఆశ్రమానికి చెందిన నాలుగు క్యాంపస్ లలో సోదాలు జరుగుతున్నాయి. భక్తుల విరాళాలు పక్కదారి పడుతున్నాయని, ఆదాయ పన్ను కట్టడం లేదని భారీగా ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగం లోకి దిగారు. తొలి రోజు ఐటీ సోదాల అనంతరం వారు అక్కడే ఉన్నారు, రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. మొత్తం నాలుగు వందల మంది అధికారులు పదహారు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఆశ్రమ ఆదాయ కార్యకలాపాలూ, ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా సోదాలు జరుపుతున్నారు.


వరదయ్యపాలెం ఆశ్రమం ప్రధాన ద్వారం మూసి వేశారు, పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల్లోని కల్కీ ఆశ్రమాలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కల్కి భగవాన్ కృష్ణాజీ దంపతులు, సీఈవో లోకేష్ దాసాజీ లను అధికారులు విచారిస్తున్నారు. తొలి రోజు ఆశ్రమం నుంచి ముప్పై మూడు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమ నిర్వాహకులు భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి, ఆ సొమ్ముతో భూముల కొనుగోలు, డిపాజిట్ లు దుర్వినియోగమవుతున్నట్టు తమిళనాడు ఐటి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఐటి అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఏక కాలంలో దాడులకు దిగింది.


మొత్తం పదహారు బృందాలుగా ఏర్పడి నలభై చోట్ల ఏక కాలంలో తనిఖీలు జరుపుతున్నారు. బుచ్చినాయుడు కండ్రిగ వరదయ్యపాళెం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలకు విదేశీ భక్తులు భారీగా వస్తుంటారు, కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ ఆయన సతీమణి ప్రీతిజి పర్యవేక్షణలో ఆశ్రమాలు, సేవా మందిరాలు నడుస్తున్నాయి. కృష్ణాజీ నిర్వహిస్తున్న ఇతర కంపెనీల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశాల నుంచి కల్కి ట్రస్టుకు అందిన విరాళాలపై ప్రత్యేక దృష్టి సారించారు ఐటి అధికారులు. పైగా మూడేళ్ళుగా కల్కి ఆశ్రమ ఆదాయ పన్ను ఎగ్గొట్టిందని కూడా ఫిర్యాదులు అందాయి.  

Teluguone gnews banner