ఒకపక్క లేఖలు.. మరోపక్క కాల్పులు: పాక్ తీరు
posted on Jun 13, 2014 @ 6:04PM
మొదట్నించీ పాకిస్థాన్ తీరేవేరు. ఒకవైపు స్నేహం అంటుంది. మరోవైపు కాల్పులు జరుపుతుంది. మొన్నీమధ్యే పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇండియాకి వచ్చి వెళ్ళాడు. మోడీ మదర్‌కి మంచి చీర పంపించాడు. ఆ తర్వాత భాయీ భాయీ అంటూ లేఖ రాశాడు. మోడీ కూడా షరీఫ్‌కి తిరుగు లేఖ రాశాడు. అయితే ఇంతలోనే వాస్తవాధీన రేఖ వెంబడి భారత జవాన్లపై పాకిస్థాన్ జవాన్లు కాల్పులకు దిగారు. ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తున్నారు. పాకిస్థాన్ చేస్తున్న ఇలాంటి చర్యలను ఉపేక్షించడానికి వీల్లేదని ఒమర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం జమ్ము కాశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన కాల్పులు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసి) వెంబడి భారత్ సైనిక శిబిరాలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. మోర్టార్లు వాడింది. దీంతో భారత్ సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. జనావాసాల్లోకి బుల్లెట్లు దూసుకొచ్చాయి.