రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత
సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను పోలీసులు సీజ్ చేయగా, ఈ వ్యవహారంలో 143 మందిని అరెస్టు చేసి 103 కేసులు నమోదు చేశారు.
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందోత్సాహాల వేళ. అయితే ఈ సంబరాలు మరొకరి ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన నైలాన్, సింథటిక్, మెటాలిక్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాపై నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లలో ఒకేసారి దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన, విక్రయానికి సిద్ధంగా ఉన్న మాంజాను స్వాధీనం చేసుకున్నారు.
ప్రెస్ మీట్‌లో సీపీ సజ్జనర్ హెచ్చరిక
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.“సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ. కానీ మన ఆనందం మరొకరి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదు. చైనీస్ మాంజా వల్ల పిల్లలు, వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం చైనీస్ మాంజాపై సంపూర్ణ నిషేధం విధించింది.
నిషేధాజ్ఞలు ఉన్నా కొందరు అక్రమంగా వీటి విక్రయాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఎక్కడైనా చైనా మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం,” అని స్పష్టం చేశారు. దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయడంతో కొందరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అక్రమ విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో చైనా మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉన్న మాంజా వల్ల విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలతో తయారైన మాంజాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా మాంజా విక్రయిస్తే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
నగరవ్యాప్తంగా దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్టు చేసి రూ.65.30 లక్షల విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు చేసి, 35 మందిని అరెస్టు చేసి రూ.37.22 లక్షల విలువైన 1,861 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌లో 18 కేసులు నమోదు కాగా, 29 మంది అరెస్టు, రూ.6.02 లక్షల విలువైన 301 బాబిన్లు సీజ్ చేశారు.సౌత్ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు, 10 అరెస్టులు, రూ.4.42 లక్షల విలువైన 221 బాబిన్లు స్వాధీనం అయ్యాయి.
సెంట్రల్ జోన్‌లో 6 కేసులు, నార్త్ జోన్‌లో 5 కేసులు, వెస్ట్ జోన్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి.ఈ మొత్తం ఆపరేషన్‌లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. మొత్తం నమోదైన కేసుల్లో 67 కేసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే నమోదు కాగా, 87 మందిని అరెస్టు చేసి రూ.68.78 లక్షల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనర్ అధికారులను, సిబ్బందిని అభినందించి నగదు బహుమతులు అందజేశారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్యలు నగరవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అవసరమైతే సంక్రాంతి ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.