రాజకీయ మైదానంగా పార్లమెంట్.. ప్రజా సమస్యలు పట్టని పార్టీలు!
posted on Jul 27, 2021 @ 4:54PM
పార్లమెంటు ఉభయసభల్లో అధికార,ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు రోజు రోజుకు శ్రుతిమించి రాగాన పడుతోందా ? పార్లమెంట్ సమావేశాల పేరిట సాగుతున్న రాజకీయం, ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు మీద ప్రతికూల ప్రభావం చుపుతోందా?అంటే, అవుననే సమాధానమే వస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 తేదీన ప్రారంభమయ్యాయి. ఆగష్టు 13తో ముగుస్తాయి. అయితే, ఇంతవరకు పార్లమెంట్ ఒక్కరోజు కూడా సక్రమంగా పనిచేసింది లేదు. పార్లమెంట్ సమావేశాలకు ఒక రోజు ముందు, వెలుగులోకి వచ్చిన పెగాసస్ స్పైవేర్,హాకింగ్ వ్యవహారం, సంవత్సర కాలానికి పైగా సాగుతున్న వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనఫై చర్చకు పట్టుపడుతున్న విపక్షాలు, ఇతర కార్యక్రమాలు ఏవీ సాగకుండా, సభా కార్యక్రమాలను స్తంభింప చేస్తున్నాయి.అదే తమ విజయంగా ప్రకటించుకుంటున్నాయి. ఈ రోజు (మంగళవారం) కూడా అదే కథ నడిచింది.దీంతో ప్రతిపక్ష పార్టీలు సభా కార్యక్రమాలను స్థంబింపచేయడం ఒక్కటే ఎజెండాగా ముందుకు సాగుతున్నాయన్న ఆరోపణను ఎదుర్కోనవలసివస్తోంది.
ప్రతిపక్షాల నిర్వాకం ఇలా ఉంటే ప్రభుత్వం బిల్లులు పాస్ చేసుకుని బయట పడడం ఒక్కటే, ఎజెండాగా తన పని తాను చేసుకుపోతోంది. అంతే కానీ, సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని కలుపుకుపోయే ప్రయత్నం చేయడం లేదు. ప్రజాసమస్యలపై చర్చకు, ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజల ఎదుర్కుంటున్న సమస్యలకు, ముఖ్యంగా కొవిడ్ కారణంగా అన్ని రంగాలు ఎందుర్కుంటున్న సంక్షోభాలకు పరిష్కారం చూపే ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరగడం లేదు .. ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు.
ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి రాజకీయ ఎజెండాతో ఎవరి పని వారు పని చేసుకుపోతుంటే, ప్రజల సమస్యలు ప్రస్తావించేది ఎవరు? సమస్యలకు పరిష్కారాలు చూపేది ఎవరు? నిజమే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్న పెగాసస్ స్పైవేర్, విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ అంశం కీలకమైనదే, కాదనలేము. అలాగే, సాగు చట్టాల అంశం కూడా కీలకమైనదే. కానీ,ఆ రెండు అంశాలనే పట్టుకుని విపక్షాలు పార్లమెంట్’ని స్థంబింప చేయడం వలన,అంతకంటే కూడా, దేశాన్ని అతలాకుతలం చేస్తున్నకొవిడ్ సంబందిత సమస్యలు గాలికి కొట్టుకు పోతున్నాయి. ఉదాహరణకు, సోమవారం రాజ్య సభ జీరో అవర్‌లో కొవిడ్ టీకాల కొరత, కరోనా వల్ల ఉపాధి కోల్పోవడం, పెట్రో, నిత్యావసర వస్తువుల ధరలు వంటి కీలక అంశాలను ప్రస్తావించడానికి అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాల నిరసన వల్ల వాటిఫై చర్చను చేపట్టలేకపోయామని, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.మంగళవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సభాకార్యక్రమాలు సాగుతున్న తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రజాప్రయోజనాలకు సంబందించిన అంశాలపై చర్చకు అధికార,ప్రతిపక్షాలు పోటీ పడాలని, నిరసనల్లో కాదని ఆయన సభాముఖంగానే ఇరు పక్షాలకు చురకలు వేశారు.
ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం, విపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విపరీత ధోరణి కారణంగానే సభా కార్యక్రమాలు సాగడం లేదని ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆగ్రహం వ్యక్త పరిచారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని, ముందు ఆ విషయంపై చర్చించిననా తర్వతనే ఇతర అంశాలు చర్చించాలని పట్టు పడుతున్నాయి. హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనీ కూడా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే విపక్షాల ఐక్యతను చూపించేందుకు అంతగా ప్రాధాన్యత లేని అంశం మీద ప్రతిపక్ష పార్టీలు చర్చకు పట్టు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులే కాదు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా తప్పు పడుతున్నారు.
రోజురోజుకు చట్ట సభల పరినితీరు దిగాజరిపోతోందని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు, రాజనీతిజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చు, (ఎంపీల జీతభత్యాలు కాక) సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దీనికి ఎంపీల జీత భత్యాలను కలిపితే అది ఇంకెంత ఉంటుందో .. ఉహించుకోవలిందే. ఇలా ప్రజా ధనాన్ని దుర్వునియోగం చేసే అధికారం పార్లమెంట్’కు ఉందా, అని కూడా పెద్దలు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం కొవిడ్ మహమ్మారి కారణంగా పార్లమెంట్ సమావేశాలు అంతంత మాత్రంగానే జరిగాయి. గత సంవత్సరం మొత్తం 33 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. చివరకు బడ్జెట్ సమావేశాలు కూడా తూతూ మంత్రంగా కేవలం ఎనిమిది రోజులు మాత్రమే జరిగాయి. అంటే ఇంచు మించుగా సంవత్సరం తర్వాత పార్లమెంట్ కొంతలో కొంత ఒక పద్దతి ప్రకారం జరుగుతోంది, ఈ వర్షాకాల సమావేశాలలోనే .. ఇలాంటి సమయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని పట్టుకుని సభా కార్యక్రమాలను స్తంబింప చేయడం, రాజకీయంగా చూసినా విజ్ఞత కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కొవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, వాక్సినేషన్ (టీకాల) విషయంలో ఇంకా ఘోరంగా విఫలమైంది, ఇక నిత్యావసర సరకుల ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి, పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేశాయి, పరిశ్రమలు మూతపడి, లక్షలాది కార్మికులు మంది ఉపాధి కోల్పోయి, వీధుల పాలయ్యారు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల కార్మికులు, వీరు వారని కాదు సామాన్య జనం పడుతున్నకస్టాలు ఇన్నీ అన్ని కాదు. ఈ అన్ని విషయల్లోనూ ప్రధాని మోడీ ప్రభుత్వంఘోరంగా విఫలమైంది. మోడీ వైఫల్యాలను ప్రజలు గుర్తించారు. ఆయన పాపులారిటీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వం మీద దండయాత్ర చేసందుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఇలాంటి ప్రజల అనుభవంలో ఉన్న ప్రజా సమస్యలు ఇన్ని ఉండగా, అనుమాన స్పదంగా ఉన్న పెగాసస్ ను పట్టుకుని వేళ్ళాడడం ఏమిటని, ప్రజలే ప్రశ్నిస్తున్నారు. నిజానికి, నిజమైన ప్రజా సమస్యలను లేవనెత్తితే, ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు మరింతగా లభించేది.ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోలేని డిఫెన్సులో పడేదని అంటున్నారు. అందుకే, రాజకీయ విశ్లేషకులు ఈ సమావేశాల్లో ప్రతిపక్షలు వ్యవహరిస్తున్న తీరు అనుమానస్పదంగా ఉందన్న మాట కూడా వినిపిస్తోంది. విపక్షాలు చక్కని అవకాశం వదులుకున్నాయని అంటున్నారు. అందుకే కావచ్చు, ఇంతకీ ప్రశాంత్ కిశోర్ ... ఎవరికోసం పనిచేస్తున్నారు. డీల్ మోడీ తోనా ... సోనియాతోనా ..మోడీతో డీల్ కుదుర్చుకుని, విపక్షాలను తప్పుదారి పట్టిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వినవస్తున్నాయి.