ముఖ్యమంత్రి మా పర్సు కొట్టేశాడు మహాప్రభో..
posted on Jul 27, 2021 @ 6:32PM
ఏపీలో సర్పంచుల పర్సు గల్లంతయింది. గ్రామ సచివాలయాల ఖాతాలకు చిల్లు పడింది. ఒక్కో గ్రామానికి చెందిన ఖాతా నుంచి లక్షలాది రూపాయలు మాయమైపోయాయి. ఏకంగా 33 కోట్ల రూపాయలకు కన్నం పడిందంటే సర్పంచులంతా ఎలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందతా ఏ సైబరాసురుడి అటాకో, ఆన్ లైన్ స్కామాసురుడి మోసమో కాదు.. అచ్చంగా ఆంధ్రా ప్రభుత్వమే గ్రామ సచివాలయాల ఖాతాల మూలుగలు పీల్చేసింది. ప్రభుత్వ పెద్దలే తమ జేబులకు చిల్లులు పెడితే గ్రామ నిర్వహణ ఎలా చేయాలంటూ ఏపీలో సర్పంచులంతా మొత్తుకుంటున్నారు.
గత ఫిబ్రవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన గ్రామ ప్రథమ పౌరులందరిదీ ఇదే పరిస్థితి. పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని పక్కాగా నిర్వహించాలన్నా, నల్లాల నిర్వహణ చేయాలన్నా, గ్రామంలో చీకట్లు పరుచుకోకుండా స్ట్రీట్ లైట్లు నిర్వహించాలన్నా సర్పంచుల దగ్గర నిధులుండాలి. గాంధీ మహాత్ముడి ఆశయమైన గ్రామ స్వరాజ్య లక్ష్యం సాకారం కావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం కేటాయింపుల కింద నిధులను నేరుగా గ్రామాల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీంతోపాటు గ్రామ ప్రజలు చెల్లించే ఇంటిపన్నులు, నీటి పన్నులు వగైరా ఇతర ఆదాయ మార్గాలుంటాయి. ఏ గ్రామ సర్పంచ్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టినా ఈ నిధులే ఆధారం.
కానీ ఆంధ్రా సర్కారు మాత్రం గ్రామాలకు వచ్చే ఆక్సిజన్ పైపునే తొలగించిందంటున్నారు సర్పంచులు. పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచులందరూ ఇదే అభిప్రాయం వినిపిస్తుండడం గమనించాల్సిన అంశం. పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తరువాత చెక్ పవర్ వచ్చిందని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇక అభివృద్ధి పనులు మొదలు పెడదామని బ్యాంకు అకౌంట్లు చూస్తే జీరో బ్యాలెన్స్ దర్శనమివ్వడంతో భూమి కింద నేల చీలిపోయిందన్న ఫీలింగ్ కలుగుతోందని పలువురు సర్పంచ్ లు బాహాటంగానే చెబుతున్నారు. వారిలో అధికార పార్టీకి మద్దతుదారులైన సర్పంచులు కూడా ఉండడం విశేషం. అప్పటికే జమయిన 14వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను కూడా వాడుకోలేకుండా ఫ్రీజ్ చేసిందని తమకు గ్రామ కార్యదర్శి చెప్పేదాకా తెలియదని లబోదిబోమంటున్నారు. ఇప్పుడే మొహం పెట్టుకొని ఊళ్లో తిరగాలో అర్థం కావడం లేదని సర్పంచులంతా బావురుమంటున్నారు.
ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే..
గ్రామ సచివాలయాలకు ఈ దుస్థితి ఎందుకొచ్చిందో తెలిస్తే బుర్ర తిరగడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల కోసం గ్రామ పంచాయతీల నిధులు వాడుకోవడానికి జగన్ సర్కారు భారీ కుట్ర చేసిందన్న అంశం వెలుగుచూస్తోంది. పేరు ప్రఖ్యాతుల కోసం భారీ ఎత్తున పథకాలు, ప్రచార కార్యక్రమాలు చేసుకుంటున్న సర్కారు ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేనివైనం కళ్లకు కడుతోందిప్పుడు. ఆయా సర్పంచులకు గ్రామ కార్యదర్శుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం విద్యుత్ బకాయిల కోసమే పంచాయతీల అకౌంట్లు ఫ్రీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. మీరు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల కోసం తమ ఖాతాలు ఖాళీ చేస్తే.. మరి పంచాయతీ చేయాల్సిన అభివృద్ధి పనుల సంగతేంటని వారు సీఎం నిర్వాకాన్ని నిలదీస్తున్నారు. సఫాయీ సిబ్బందికైనా వేతనాలు చెల్లించకపోతే పారిశుధ్యం ఎలా ఉంటుందంటున్నారు. తాగునీటి సిబ్బందికి, గ్రామ సుంకరులు, నీరటిల వేతనాలు, పాఠశాలల మరమ్మతులు, మరుగుదొడ్లు, శ్మశానవాటికల నిర్వహణ, బురద కొట్టుకుపోయిన వీధులు బాగు చేయడం, ఇంకా ఆగిపోయిన అనేక అభివృద్ధి పనుల కొనసాగింపు ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సమయంలో పోటీపడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా జగన్ సర్కారు భారీ కసరత్తే చేసింది. ఆ సర్పంచులంతా అప్పుడు ఎన్నో ఆశయాలతో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూర్తి చేద్దామనుకునే సమయంలోనే.. గ్రామాభివృద్ధి రథాన్ని అడ్డుకున్న అసలు సైంధవులెవరో ఆలస్యంగా తెలిసిందని వారు వాపోతున్నారు. ఇప్పుడు తాము ఎన్నికై ఏం లాభం.. పనుల కోసం వచ్చే ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి అంటూ వాపోతున్నారు. మరి గ్రామాలకు పట్టిన ఈ దుస్థితి ఎప్పుడు తొలగుతుందీ.. ముఖ్యమంత్రి గానీ, ఆయన కోటరీ గానీ ఈ పరిస్థితికి ఏం జవాబు చెప్తారు.. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది..