తూచ్ .. జగన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదు
posted on Sep 22, 2022 @ 6:24PM
చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఆ చెప్పేది శ్రీ సర్కార్ స్వామి అయితే, ఇక చెప్పడానికి ఏముండదు. ఎప్పుడో కాదు, జస్ట్ ఓ రెండు నెలల కిందట, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార దర్పంతో అత్యంత ఘనంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే జగన్ రెడ్డి తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను సగౌరవంగా పార్టీ నుంచి సాగనంపారు. అదే సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఇదేమీ రహస్యంగా జరిగిన తంతు కాదు. బహిరంగంగానే జరిగింది. ప్లీనరీలో జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లుగా, మరెవరో కాదు, పార్టీలో నంబర్ 2 విజయసాయి రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. నాయకులు జగన్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. శాలువాలు కప్పారు, బొకేలు ఇచ్చారు. జగనన్న గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. జగన్ రెడ్డి రాజ దర్పంతో చిరునవ్వు చెరగకుండా ఈ మొత్తం క్రతువును చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే, తనపై విశ్వాసం ఉంచి, పార్టీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పార్టీలోని ప్రతి ఒక్కరికీ తనదైన స్టీల్లో చేతులెత్తి కృతజ్ఞలు చెప్పారు. ఇదంతా పార్టీ క్యాడర్ కన్నుల పండగగా చూశారు. చప్పట్లు కొట్టారు, చిందులేశారు.
అయితే, ఇప్పుడు నా పార్టీ నా ఇష్టం, అంటే కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ‘శాశ్వత’ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన అక్షింతలు వేసింది. ఒక పద్దతి ప్రకారం, ప్రజాస్వామ్య పద్దతిలో అధ్యక్షుని ఎన్నిక జరగాలని తాఖీదు ఇచ్చింది. సరే జరిగిందేదో జరిగిందని, అలా ఉరుకుంటే ఎలా ఉండేదో ఏమో కానీ, ఏపీ ప్రభుత్వ ‘అల్ ఇన్ వన్’ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజును మించిన విధేయతను చూపించారు. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు మీడియా ముందు అబద్ధాలు చెప్పడంలో తమ అనుభవం మొత్తాన్నిరంగరించి, అందమైన అబద్ధాలను అలవోకగా ప్రవచించారు.
జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్ష పదవిన ఎన్నుకున్నది నిజమే కానీ, ఆయన అంగీకరించలేదని, అందుకే ప్లీనరీ మినిట్స్ లో చేర్చ లేదని చక్కగా చెప్పుకొచ్చారు. అంగీకరించకపొతే ఆ అభినందనలు , హారతులు ఎందుకు? ఆ చిరు నవ్వులు ఎందుకు, అదే విషయం అప్పుడే అక్కడే ఆయనే చెప్పి ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాయవలసిన అవసరమే ఉండేది కాదు కదా అంటే, దానికి సజ్జల దగ్గర సమాధానం లేదు. పోనీ అప్పుడు కాకపోయినా, ఆ తర్వాత ఎన్నికల్ సంఘం నుంచి రెండో మూడో తాఖీదు లేఖలు అందిన తర్వాత అయినా ఒక ప్రకటన ఇస్తే ఇంతవరకు రాకపోను కదా, అంటే అందుకూ సమాధానం లేదు. అందుకే అంటారు, అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలని. అయినా పుర్వాశ్రయంలో పాత్రికేయులుగా పని చేసిన సజ్జల వారికి, ప్రజాస్వామ్యంలో శాశ్వత పదవులు ఉండవని.. తెలియక పోవడం ఏమిటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.