రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైఎస్సార్ పేరు పెట్టుకోండి.. తెలుగువన్ ఎండి కంఠంనేని రవిశంకర్
posted on Sep 22, 2022 @ 3:22PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరున ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ వర్సిటీగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్ననిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్‌వర్సిటీ పేరు మార్చాలని ఏపీ అసెంబ్లీ సవరణ బిల్లు ఆమోదించడం దౌర్బాగ్యమని తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలు, రాష్ట్రంలో ఇతర కేంద్ర కారాగారాలకు వైస్సార్ పేరు పెడితే ముందుముందు ముఖ్యమంత్రి జగన్‌కి, ఆయన సహచరులకూ ఎంతో ఉపకరిస్తుందని తెలుగు దేశం నాయకుడు, తెలుగువన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ అన్నారు.
ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉంటే దోచుకోవడమే జరుగుతుందని, అది వారి సహజలక్షణ మని రవిశంకర్ ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో చాతకాదనీ, ఒక పరిశ్రమకానీ, ఒక ప్రాజెక్టు కానీ ఈ సీఎం హయాంలో రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. జగన్ను నమ్మి, జగన్ పాలనను నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పారిశ్రామిక వేత్త కూడా రారనీ, అందుకే 36 ఏళ్ల కిందట ఎన్టీఆర్ స్థాపించిన ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టుకోవాలన్న దురాలోచతోనే జగన్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని రవిశంకర్ అన్నారు.
ఫ్యాక్షనిస్టులకు దోచుకోవడం, ఆక్రమించడమే తెలుసనీ, ప్రగతి, సంక్షేమం పట్టవని విమర్శించారు. రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలమై, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి అర్ధంలేని ఎత్తుగడలతో ఇటువంటి దౌర్బాగ్యపు పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంత సులువు కాదనీ ఐఎంఏ అంగీకరించదనీ కంఠంనేని అన్నారు.