నాన్న ప్రేమతో..మామ మోసంతో...!!
posted on Jan 7, 2016 @ 4:47PM
అతను ఒంటరిగానే ప్రయాణం మొదలు పెట్టాడు. గుర్తింపు కోసం తపన పడ్డాడు. తన కుటుంబం నుంచి తన తల్లికి ప్రపంచం నుంచి ‘తనకి’ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని తపించిపోయాడు.. బాల్యమంతా అవమానాల బరువుని మోసాడు... ఏ తాత రూపం పుణుకి పుచ్చుకున్నాడో ఆ తాత ఒడి చేరటానికి పదకొండేళ్ళు ఎదురు చూడాల్సీ వచ్చింది. ఏ కుటుంబ రక్తం పంచుకున్నాడో ఆ కుటుంబం అక్కున చేరటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. అప్పటి వరకు పోరాటమే... తనతో తన చుట్టూవున్న ప్రపంచంతో... తనలోని ఒంటరితనంతో... పోరాడుతూనే వున్నాడు. చివరకి విజయం వరించింది. కుటుంబం అతని కలుపుకుంది. రూపంలో, నటనలో, వాక్చాతుర్యంలో, ఒకటేమిటి అన్నిటా తాతగారికి అసలుసిసలు వారసుడనిపించు కున్నాడు.
సంతోషం.... జీవితంలో అతను కోరుకున్న పెన్నిధి దొరికినందుకు సంతోషంతో పొంగిపోయాడు. చివరికి తన కుటుంబ పరువు ప్రతిష్టలకోసం ఆ కుటుంబంనడిపే పార్టీకోసం ఖాఖి బట్టలు తొడిగి తాతలా ఊరూరా , వాడవాడలా ఎండనక, వాననక తిరిగి... ప్రచారం చేసాడు. ఆ క్రమంలో... యాక్సిడెంటు అయ్యి ప్రాణాల మీదకి వస్తే కూడా చిరునవ్వుతో ... నా కుటుంబం వుండగా నాకెందుకు భయం అంటూ.. ఆ కష్టాన్ని దాటేసాడు.
అంతా బావుంది అనుకున్న సమయంలో, తను ఎంతో ప్రేమించే కుటుంబం అతనిని దూరం పెట్టడం మొదలు పెట్టింది.. తను ఎంతగానో ఆరాధించే బాబాయ్ క్రమక్రమంగా దూరమయ్యాడు. అతని అభిమానులు కూడా ఇతనిని దూరం పెట్టారు. పార్టీ నుంచి దూరం.. కావల్సిన వారి నుంచి దూరం....
ఎక్కడ అడుగులు తడబడ్డాయి ?
ఎప్పుడు దానికి బీజం పడింది ?
ఎవరు దీనికి కారకులు?
యంగ్ హీరోల్లో దాదాపు అందరికంటే ముందుగానే ఓ ఇంటి వాడయ్యాడు మన రామయ్య! లక్ష్మీ కళ ఉట్టిపడే ప్రణతి మెళ్లో మూడుముళ్లు వేసినప్పుడు నందమూరి అభిమానులతో పాటూ సామాన్య జనం కూడా ఫుల్ గా సంతోషించారు! కాని, సింగమలై అక్కడే రాంగ్ సిగ్నల్ అందకున్నాడని తాజాగా తెలుస్తోంది! ఆ రాంగ్ సిగ్నల్ పేరే… నార్ని శ్రీనివాస రావు అదే మన యంగ్ టైగెర్ కి
పిల్ల నిచ్చిన మామ!
ఇక్కడ ఇతని కోసం కాస్త చెప్పుకోవాలి..
నార్ని శ్రీనివాసరావుది వార్నీ అనిపించే జర్నీ! సాదాసీదా స్థాయి నుంచీ సాధ్యం కానంత పెద్ద లెవల్ కి ఎదిగాడు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్! చంద్రబాబుకి ఒక విధంగా బంధువైన ఆయన ఎకరాలకు ఎకరాలు హైద్రాబాద్ లో కొనుగోలుచేసాడు ..తిరిగి అమ్మకాలు కూడా బారీగానే చేశాడు. దీనికి రాజకీయంగా ఎంత సపోర్ట్ లభించిందో దేవుడికే తెలియాలి..
అసలు ఈయన జూనియర్ ని తన అల్లుడ్ని చేసుకుంటున్న విషయమేచంద్రబాబుకి తెలియదట అప్పట్లో! అందుకు తగ్గట్టే బాబు, హరి కృష్ణ ఎడ మొహం పెడ మొహంగానే ఎన్టీఆర్ పెళ్లి వేడుకులు జరిగాయి!
నార్నీ శ్రీనివాసరావుతో బంధుత్వం ఏర్పడ్డాక నానా రకాల ప్రచారాలు, గాసిప్సు చక్కర్లు కొట్టి ఎన్టీఆర్ తన ప్రమేయం లేకుండానే టీడీపీకి,
బాబుగారికి, టీడీపీ శ్రేణులకి దూరమయ్యాడు. ఇందుకు చాలా వరకూ శ్రీనివాసరావు జగన్ తో చేసిన రాజకీయ బేరసారాలు కూడా కారణం. చివరకు, టీడీపీతో పాటూ తారక్ కి వున్న నందమూరి అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆవిరైపోయింది! ఇప్పుడు బాలయ్య అభిమానులు జూనియర్ సినిమా చూడని పరిస్థితి.
నార్నీ వారి అల్లుడయ్యాక సరైన హిట్ ఒక్కటీ కొట్టలేకపోతున్న మన బాద్షాకి…బాధలు ఇక్కడితో ఆగిపోలేదు. మామ నార్నీ శ్రీనివాసరావు మరీ దారుణంగా అల్లుడినే ఆర్దికంగా దెబ్బ తీసాడు. హైద్రాబాద్ లోని మణికొండలో వున్న ఒక ల్యాండ్ చూపించి ఎన్టీఆర్ వద్ద నుంచి 9కోట్లు తీసుకున్నాడు. దాని విలువ 15కోట్లకు తక్కువ కాదని బుకాయించి గిఫ్ట్ డీడ్ గా రెజిస్ట్రేషన్ కూడా చేయించాడు!
నిజానికి 2389 గజాల ఆ భూమికి తారక్ 9 కోట్లు ఇవ్వటం నష్టమేం కాదు. మరింకేంటి అంటారా? అక్కడే వుంది ట్విస్ట్ ..అమ్మిన సదరు భూమి రాజ్ భవన్ రోడ్లోని ఐఓబీ బ్యాంక్ శాఖలో తనకాలో వుంది! తాకట్టు పెట్టి అప్పటికే 11 కోట్లు తీసుకున్నాడు అతని మామ. ఇక అంత కంటే బాధా కర విషయమేంటి అంటే వివాహసమయంలో తన కూతురుకి పసుపు కుంకుమ కింద 200 కోట్లు ఇస్తానన్న నార్నే శ్రీనివాసరావు అవి ఇవ్వకపోగా తన అవసరానికి అల్లుడు దగ్గర 9 కోట్లు తీసుకున్నాడు. అసలు కథ అంతా ఈ 9 కోట్లు తిరిగి ఇవ్వమని అల్లుడు అడిగినప్పుడే బయటపడింది.
నిజానికి కొడుకు మొదటి పుట్టిన రోజుకి ఆ భూమిని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు ఎన్టీఆర్. కాని మామ చేసిన మోసంతో ఆపని చేయలేక, మోసపోయినందుకు బాధపడుతూ తన కొడుకు పుట్టినరోజు వేడుకలని జరపాల్సి వచ్చింది. ఇలా పిల్లనిస్తూ ఇస్తానన్న కోట్లు పోయే, తన కష్టార్జితమూ పోయే.
పాపం ఎంతో కష్టపడి బాల రాముడి స్థాయి నుంచి తారక రాముడి ఇమేజ్ దాకా ఎదిగాడు జూనియర్. నందమూరి కుటుంబం లక్ష్య పెట్టని స్థితి నుంచీ అందరి లక్ష్యం తానే అయ్యేలా చేసుకోగలిగాడు. ప్రచారంలో ఖాకీ చొక్కా వేసుకుని దుమారం రేపి టీడీపికి, చంద్రబాబుకి ఆప్తుడయ్యాడు. ఇలా అన్ని నిచ్చెనలూ ఎక్కేసి… చివరాఖరుకి… వైవాహిక వైకుంఠపాళిలో మామ మింగిన పావులా మళ్లీ కింద వరసకొచ్చేశాడు!
పిల్లనిచ్చిన మామే అతనిని ఇబ్బందులు పెడితే, స్వంత మామగారే ప్లాన్ చేసి మరీ అతనిని ఇరికిస్తే... అతనిని ఒంటరి వాడిని చేస్తే... పాపం తారక్ మాత్రం ఏం చేయగలడు. ఈ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తూ మధనపడటం తప్ప.