పాక్ పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరి సరయినదేనా?
posted on Jan 6, 2016 9:01AM
పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది. కానీ ఆ వైఖరిని బీజేపీ మిత్రపక్షమయిన శివసేన తీవ్రంగా విమర్శించింది. నవాజ్ తో ఒక కప్పు టీ త్రాగినందుకు ఏడుగురు జవాన్లను బలి చేసుకోవలసి వచ్చిందని విమర్శించింది. గణతంత్ర దినోత్సవం రోజున మన ఆయుధాలను ప్రదర్శించుకోవడం తప్ప వాటిని ఉపయోగించి పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పలేకపోతున్నామని ఎద్దేవా చేసింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం బీజేపీ విధానం కాదు. ఇదివరకు యూపిఏ విధానాన్నే మోడీ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు మరియు మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత కూడా భారత్ ఇంకా పాక్ తో చర్చల గురించి ఆలోచించడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. కనుక తక్షణమే చర్చలను రద్దు చేసుకొని పాక్ పట్ల కటినంగా వ్యహరించాలని కోరారు. మోడీ లాహోర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పట్టింది కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వం పాక్ పట్ల అనుసరిస్తున్న విధానాన్ని గట్టిగా విమర్శించలేదు. దీనిపై ఏదో మాట్లాడాలి గాబట్టి మాట్లాడుతునట్లుగా "పాక్ పట్ల పునరాలోచించుకొని అడుగు ముందుకు వేయమని" హెచ్చరించింది.
కానీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థలపై, వ్యక్తులపై తక్షణమే కటినమయిన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం గమనిస్తే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే సరయినదని రుజువు అయ్యింది. గతంలో ఎన్నడూ పాక్ ప్రభుత్వం ఈవిధంగా స్పందించలేదు. దాడి జరిగిన వెంటనే దానితో తమ దేశానికి ఎటువంటి సంబంధమూ లేదని వాదించేది. కానీ ఈసారి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ఈ దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకొంటామని చెప్పడం ద్వారా తమ దేశంలోనే కుట్ర జరిగిందని అంగీకరించినట్లయింది. అది మోడీ ప్రభుత్వం అనుసరించిన విదేశాంగ విధానంలో ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చును.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన మాటకు కట్టుబడి ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకొంటారా లేదా అనే విషయాన్నీ పక్కనబెట్టి ఆలోచిస్తే, భారత్ అనుసరించిన వైఖరి కారణంగానే పాక్ ప్రభుత్వంలో ఈ మార్పు సాధ్యమయిందనే విషయం స్పష్టం అవుతోంది. కానీ ఇది గమనించకుండా పాక్ తో చర్చలు రద్దు చేసుకొని, వీలయితే పాక్ పై దాడులు చేయాలని సూచించడం ఆత్మహత్యతో సమానమే. పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులు చేయడం భారత్ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంగానే భావించక తప్పదు. దాని వలన భారత్ అహం దెబ్బ తింది. కనుక పాక్ తో జరుగబోయే చర్చలను రద్దు చేసుకొని దానితో కటినంగా వ్యవహరించినట్లయితే పాక్ ఉగ్రవాదం వైపే మళ్లవచ్చును. దాని వలన మళ్ళీ భారతదేశమే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక పాక్ తో చర్చలు రద్దు చేసుకొని, దానితో మళ్ళీ కొన్ని దశాబ్దాలపాటు ఘర్షణపడే బదులు దానితో చర్చలు కొనసాగిస్తూ, అక్కడి ప్రజా ప్రభుత్వం బలపడేందుకు వీలయినంత సహాయసహకారాలు అందిస్తూ పాక్ లోని ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి కృషి చేయడమే సరయిన విధానం. ఉగ్రవాదులను సమూలంగా మట్టుబెట్టాలంటే ఇంతకంటే మంచి మార్గం లేదని చెప్పకతప్పదు.