ఎన్టీఆర్ కూతురు.. నాదెండ్ల కొడుకు..
posted on Apr 1, 2021 @ 2:12PM
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం కోసం ఎవరు ఎవరితోనైనా కలుస్తారు అనేందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు. తాజాగా, తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల వేళ అలాంటి అరుదైన కలయిక కనిపిస్తోంది. ఎన్టీఆర్ కూతురు, నాదెండ్ల కొడుకు కలిసి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పురందేశ్వరీ.. జనసేన నెంబర్ 2 నేత నాదెండ్ల మనోహర్‌కు.. తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. చరిత్రలో జరిగిన గాయాన్ని తుడిపేసుకొని.. కొత్త చరిత్ర సృష్టించేందుకు కలిసి పని చేస్తున్నారు. ఆ అరుదైన కలయిక.. ఆ ఇద్దరు నేతలకు ఎలా ఉందో గానీ.. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిహాసం గురించి తెలిసిన వారంతా వారిద్దరినీ చూసి ఈసడించుకుంటున్నారు. ఆనాటి అరాచకాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు...
అది 1984 ఆగష్టు. ఆనాడు జరిగిన ఆ సంక్షోభమే.. ఆ తర్వాత కాలంతో టీడీపీలో ఆగష్టు సంక్షోభంగా ముద్ర పడింది. నేటికీ ఆగష్టు నెల వస్తోందంటే తెలుగుదేశం పార్టీలో కాస్తో కూస్తో కలవరమే. 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీ స్థాపించి.. 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించేశారు. ఐరన్ లేడీ ఇందిరను గడగడలాడించారు. 1983 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు నందమూరి తారకరామారావు.
వెండితెర ఇలవేల్పు ఎన్టీవోడు ముఖ్యమంత్రి కావడం ఓ సంచలనం. బూజు పట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాలను స్వస్తి చెప్పి.. అనతికాలంలోనే తనదైన శైలిలో అనేక పథకాలు, పాలనలో సంస్కరణలు చేసి చూపించారు ఎన్టీఆర్. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. రామారావు ప్రభుత్వం పాలనలో దూసుకుపోతుండగా.. అంతలోనే అనుకోని ఉపద్రవం. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలానికే.. సర్కారును కూల్చేసే కుతంత్రం. నేటి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు నేతృత్వంలో జరిగిందా ప్రజాస్వామ్య పరిహాసం. ఇందిరాగాంధీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు నాదెండ్ల భాస్కర్‌రావు.
అప్పట్లో అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగొచ్చే లోగా ఇక్కడ ప్రభుత్వం మారిపోయింది. కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో.. అప్పటి గవర్నర్ రామ్‌లాల్ సాయంతో.. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి పదవిని కొల్లగొట్టారు. అదంతా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కనుసన్నల్లోనే జరిగింది. విషయం తెలిసిన ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. నాదెండ్ల సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి తెరతీశారు. "ధర్మ యుద్ధం" పేరుతో నల్ల డ్రెస్ వేసుకొని ఢిల్లీపై దండయాత్ర చేశారు ఎన్టీఆర్. రామారావు చేపట్టిన ధర్మ యుద్ధానికి దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సీపీఐ, సీపీఎమ్, బీజేపీ, జనతాపార్టీ ఇలా అంతా ఎన్టీఆర్ వెంట నడిచారు. ధర్మ యుద్ధంతో ఢిల్లీని గడగడలాడించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రదర్శించిన చాణక్యం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచింది. ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలందరితో కలిసి రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ నిర్వహించారు. ఇందిరా దిగొచ్చారు. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. గవర్నర్ రామ్‌లాల్ మారిపోయారు. టీడీపీలో ఆగస్టు సంక్షోభం సుఖాంతమైంది. ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కు పైగా ఎమ్మెల్యేలతో సత్తా చాటి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు.. కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాదెండ్ల భాస్కర్‌రావు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి చివరి వరకూ కొనసాగారు. తండ్రి వారసత్వంగా నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ సైతం కాంగ్రెస్‌లోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో స్పీకర్‌గా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి.. జనసేనలో చేరి.. పవన్‌కల్యాణ్ తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు.
ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి, నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌లు.. ఆనాటి రాజకీయ వైరాన్ని మరిచి.. నేడు తిరుపతిలో రాజకీయ పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా.. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కోసం బీజేపీలో తరఫున పురంధేశ్వరి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌లు కలిసి ప్రచారం చేయడం కొందరికి కంపరంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌కు అంత ద్రోహం చేసిన నాదెండ్ల కుటుంబాన్ని ఆయన కూతురు పురంధేశ్వరి క్షమించారా? లేక, సమయానుకూలంగా అంతా మరిచిపోయారా? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే, తండ్రి చేసిన పాపం కొడుక్కు ఎలా వర్తిస్తుందని సమర్థిస్తున్నాయి జనసేన వర్గాలు. ఏదిఏదైనా.. ఎన్టీఆర్ కూతురు, నాదెండ్ల కొడుకు ఒకే వేదికపై కనిపించడం రాజకీయల్లో ఏదైనా సాధ్యమే అనేందుకు నిదర్శనం.