ముఖ్యమంత్రా? విదేశీ తీవ్రవాదా?
posted on Apr 1, 2021 @ 2:14PM
10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 59 మంది ఎస్ఐలు, 147 మంది ఏయేస్సైలు, 647 మంది కానిస్టేబుల్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనలో మోహరించిన సెక్యూరిటీ. ఇంత సెక్యూరిటీతో ముఖ్యమంత్రి పాల్గొన్నద్ది పెద్ద సభేమి కాదు. కొవిడా తీసుకున్నారంతే. కొవిడ్ వ్యాక్సిన్ కోసం గుంటూరు నగరంలోని భారత్‌పేట ఆరోలైన్‌లో ఉన్న 140వ వార్డు సచివాలయానికి వచ్చారు జగన్. ఆ కార్యక్రమం కోసమే ఇంత మంది పోలీసులను మోహరించారు. అంతేకాదు 7 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ పర్యటన ముగిసే వరకు అటు వైపుగా ఎవరూ రానీయలేదు. దాదాపు 40 గంటల పాటు ఆ ప్రాంత వాసులను ఇళ్ళల్లో బందీలుగా ఉంచారనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ టీకా తీసుకునేందుకు వస్తే.. దాదాపు వెయ్యి మందితో భద్రత కల్పించడం... ఏకంగా 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలను నియమించడం చర్చనీయాంశంగా మారింది.
సీఎం జగన్ తలపెట్టిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా 14 నెలలుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లోనూ వాళ్ల ఉద్యమం ఆగలేదు. భారీ వర్షాలు కరిసినా.. చలి వణికించినా.. భానుడు భగభగమండినా రైతులు విశ్రమించలేదు. అమరావతి ఉద్యమంతో అటువైపుగా వెళ్లాలంటేనే సీఎం జగన్ భయపడిపోతున్నారని చెబుతున్నారు. సచివాలయానికి వెళ్లినా.. భారీ భద్రత మధ్యే వెళుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. కొవిట్ టీకా కోసం గుంటూరు వెళ్లడంతో ఇలా బలగాలను మోహరించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పోలీసు పహారా ఎందుకు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటి ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక విదేశీ తీవ్రవాదా? అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు ప్రజలు వైసీపీని గెలిపించినా జగన్‌కు భయమెందుకని నిలదీశారు. ఇంత మందితో భద్రత కల్పించటానికి గుంటూరు ఏమన్నా ఆఫ్ఘనిస్తానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేసి, 40 గంటల పాటు ఆ ప్రాంత వాసులను ఇళ్ళల్లో బందీలుగా చేయటం తగునా? అంటూ రామకృష్ణ ప్రశ్నలు సంధించారు.