అమెరికాతో అణ్వస్త్ర యుద్దానికి ఉవ్విళ్ళూరుతున్న ఉత్తర కొరియా
posted on Apr 5, 2013 @ 9:34PM
తీవ్ర యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న ఉత్తర కొరియా దేశ ప్రభుత్వం తన శక్తికి మించినదని తెలిసి ఉన్నపటికీ దక్షిణ కొరియాకు అండగా నిలబడ్డ అగ్రరాజ్యం అమెరికాతో ఏకంగా .అణ్వస్త్రయుద్దానికి సిద్దపడుతూ ఇరుదేశాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ రోజు ఆ దేశ విదేశాంగ శాఖ రాజధాని పయోంగ్ యాంగ్ లో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు వెంటనే తమ దేశం విడిచివెళ్ళడం వారికే క్షేమమని లేఖలు వ్రాసింది. ఈ నెల 10వ తేదీ తరువాత ఏ క్షణానయినా అణుయుద్ధం జరిగే అవకాశం ఉంది గనుక ఆ లోగా వారు దేశం విడిచి వెళ్ళకపోతే వారికి రక్షణ కల్పించలేమని తెలిపింది. బ్రిటన్, రష్యా, చైనా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు లేఖలు అందుకొన్నట్లు దృవీకరించాయి.
దక్షిణ కొరియా దేశంతో దశాబ్దాల తరబడి వైరం పెంచుకొంటూ వస్తున్న ఉత్తర కొరియా ఏనాటికయినా ఆ దేశాన్ని ప్రపంచ పటంలోంచి కనబడకుండా చేరిపేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అణ్వస్త్రాలను సైతం సమకూర్చుకోవడంతో, ఉత్తర కొరియాను అణ్వస్త్ర దేశంగా గుర్తించబోమని ఖరాఖండీగా చెప్పడమే కాకుండా అణు నిరాయుధీకరణకు కూడా అమెరికా పట్టుపట్టింది. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ (30) అణ్వస్త్ర పరీక్ష జరిపి అగ్రరాజ్యానికి సవాలు విసరడంతో పరిస్థితులు విషమించాయి.
అమెరికా కూడా దానికి దీటయిన జవాబుగా దక్షిణ కొరియా దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేసి ఉత్తర కొరియా సరిహద్దులో ఒక డమ్మీ అణ్వస్త్ర బాంబు జారవిడిచింది. అమెరికా చర్యతో మరింత ఆగ్రహించిన ఉత్తర కొరియా, ఉభయ దేశాల సరిహద్దుల వద్దగల రెండు దేశాల సహకారంతో నడుస్తున్నపారిశ్రామికవాడను మూసివేసి యుద్ధ ప్రకటన కూడా చేసింది. తన అణ్వస్త్రాలను దక్షిణ కొరియా వైపు మొహరించిన ఉత్తర కొరియా ఈ రోజు రాజధానిలో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు ఈనెల 10లొగా ఖాళీచేసి వెళ్ళిపోవడం మేలని లేఖలు వ్రాసింది. 10వతేదీ నుండి ఏరోజయినా అణ్వస్త్ర యుద్ధం జరుగవచ్చని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉత్తర కొరియా మిత్ర దేశాలయినా చైనా, రష్యాల తో సహా వివిధదేశాలు వారిస్తున్నపటికీ ఆ దేశం యుద్ధానికే ఇష్టపడుతోంది.
ఒకసారి అణ్వస్త్ర యుద్ధం మొదలయితే అది ఎంత దారుణంగా ఉంటుందో తెలిసినప్పటికీ, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నఅమెరికా వంటి దేశంతో యుద్ధానికి సై అనడం చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ది అనే మన పెద్దల మాటలు గుర్తుకు రాకమానవు. ప్రభుత్వ దురహంకారానికి, యుద్ధ కాంక్షకు అక్కడి అమాయక ప్రజలు, పిల్లలు, మహిళలు అందరూ బలవబోతుంటే ప్రపంచం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం విచారకరం.