విజయసాయి గుప్పిట్లో ఉత్తరాంధ్ర.. రగిలిపోతున్న బొత్స!
posted on Oct 6, 2021 @ 12:07PM
మనోడే కదాని ఛాన్స్ ఇచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్‌ను పొలిటీషియన్ చేశారు. జైల్లో సహచరుడనే సానుభూతితో రాజ్యసభకు పంపించారు. నమ్మకంగా పడుంటాడని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. మొదట్లో ఆల్ హ్యాపీస్. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్టెడ్. కనక సింహాసనం మీద కూర్చోబెడితే.. తన బుద్ది చూపిస్తున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రను తన కబంధహస్తాల్లో బంధించేశారని సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. ఇదంతా విజయసాయిరెడ్డి గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి, ఆ రగిలిపోతున్న నేతల్లో బడా బడా నేతలూ ఉండటమే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఉత్తరాంధ్రకు తానే మహారాజుననేలా విర్రవీగుతున్నారట విజయసాయిరెడ్డి. ఆయన కనుసైగ చేయనిదే ఆ మూడు జిల్లాల్లో ఒక్క ఫైలు కూడా అటు నుంచి ఇటు కదలడం లేదట. ప్రభుత్వ పథకాలు రావాలన్నా.. స్థానికంగా పనులు జరగాలన్నా.. అధికారులు ఫైల్స్‌పై సంతకాలు చేయాలన్నా.. బదిలీలు, పదోన్నతులు, ప్రాజెక్టులు, నిధులు, కూల్చివేతలు, కబ్జాలు.. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చీమ చిటుక్కుమనాలన్నా విజయసాయిరెడ్డి పర్మిషన్ ఉండాల్సిందే అనేంతగా పెత్తనం చెలాయిస్తున్నారట ఎంపీ విజయసాయిరెడ్డి.
ఉత్తరాంధ్రకు సాయిరెడ్డి అనకొండలా మారడంతో.. పాపం.. చిన్న పాములకు, వానపాములకు ఆహారం లేకుండా పోయిందని అంటున్నారు. గల్లీ లీడర్ల నుంచి మంత్రుల వరకూ.. ఎవరినీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ వీధిలో రోడ్డు వేయాలన్నా విజయసాయి చెప్పాల్సిందే. పించన్ ఇవ్వాలన్నా సాయిరెడ్డి ఓకే అనాల్సిందే. ఇలాగైతే మేమంతా నాయకులుగా ఉండెందుకు? అని వైసీపీ వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తాము చెబితే చిన్న చిన్న పనులైనా కాకపోతే.. ఇక ఈ పనికి రాని మంత్రి పదవి ఎందుకు? అంటూ పెద్ద స్థాయి నేతలు సైతం విజయసాయిపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు.
సాయిరెడ్డే సర్వం కావడంతో.. ఇక మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్సా సత్యనారాయణ, ధర్మాన లాంటి వాళ్లు సైతం డమ్మీలయ్యారని చెబుతున్నారు. ఇటీవల ఒకరు మంత్రి బొత్సా దగ్గరకు ఏదో పని కోసం వెళ్లారట. తన పని చేసిపెట్టండని మంత్రివర్యులను వేడుకున్నారట. అంతే, ఒక్కసారిగా ఆవేశానికి, ఆవేదనకు లోనైన బొత్సా.. "వాడు ఉన్నాడుగా.. వెళ్లి ఆ విజయసాయిరెడ్డి గాడితోనే పని చేయించుకో. నా దగ్గరకు ఎందుకు వచ్చావ్? నేను చెబితే ఏ అధికారైనా పట్టించుకుంటున్నాడా?" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన సహచరులు చెబుతున్నారు. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల దుస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కొన్ని నెలల క్రితం రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ఓ నేత.. విశాఖ జిల్లా ఉన్నతాధికారి దగ్గరకు ఏదో పని మీద వెళ్లారట. కాస్త ఆ పని చేసిపెట్టండని అడిగితే.. విజయసాయి గారిని అడిగి చెప్తా అన్నారట. నేనెవరో తెలుసుగా.. నా హోదా ఏంటో తెలుసుగా.. అని ఆ నాయకుడు గద్దించినా.. ఆ ప్రభుత్వాధికారి సింపుల్‌గా సారీ అని చెప్పేసి ఆయన్ను పంపించేశారట. అవమానభారంతో కుంగిపోయిన ఆ ప్రముఖుడు.. జరిగిందంతా సీఎం జగన్‌కు లేఖతో ఏకరువుపెట్టారని అంటారు. ఇలా ఉంది విశాఖలో విజయసాయి పెత్తనం.
ఇక విజయసాయిరెడ్డి మీద ఉన్నన్ని భూకబ్జా ఆరోపణలు ఏపీలో మరే లీడర్‌పైనా లేవు. అందుకే, ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరి, తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడటం లేదంటూ.. వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, అధికారుల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఏ లీడర్‌ను అడిగినా.. ఏ అధికారిని ప్రశ్నించినా.. విజయసాయి టార్చర్ గురించి ఏకరువు పెడుతున్నారు. మంత్రులే ఆయన బాధితులుగా మరితే.. ఇక మిగతా వారి సంగతి చెప్పేదేముంది? ఇంకెన్నాళ్లూ ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి ఆగడాలు? తాడేపల్లి ప్యాలెస్‌కి ఈ విషయాలన్నీ తెలీవనుకోవాలా? తెలిసే.. జగన్‌రెడ్డి లూప్‌పోల్స్ అన్నీ సాయిరెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టే.. ఆయన్ను అలా వదిలేశారా? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు. మరి, ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి కబంధ హస్తాల నుంచి విముక్తి ఎప్పుడో? ఎలాగో?