లోన వణికిస్తున్న భయం.. పైకి మేకపోతు గాంభీర్యం!
posted on Feb 19, 2025 @ 10:37AM
కొడాలి నాని పరిస్థితి చూస్తుంటే ఆయనపై పగవారికి కూడా జాలి వేసేలా ఉంది. లోపల అరెస్టు భయంతో వణికిపోతూ కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రెడ్ బుక్ భయం లోపలలోపల తొలిచేస్తుంటే.. పైకి మాత్రం తాను రెడ్డ బుక్ ను చూడలేదనీ, అసలెవరైనా చూశారా అని ప్రశ్నలు వేస్తున్నారు. అసలు గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైన తరువాత నుంచీ కొడాలి నాని పెద్దగా బయట కనిపించింది లేదు. వినిపించింది లేదు.
వైసీపీ అధికారంలో ఉండగా నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా బూతులతో చెలరేగిపోయిన కొడాలి నాని.. వైసీపీ ఓటమి తరువాత బయట కనబడటం తగ్గింది. అంతే కాదు, భాష మారింది. పొల్లు మాట మాట్లాడడానికే జంకుతున్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని పూర్తిగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి మరీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అయితే జగన్ విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీ తో ములాఖత్ సందర్భంగా అనివార్యంగా బయటకు వచ్చారు. జగన్ తో పాటు జైలు వద్ద మీడియాకు కనిపించారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబుపైనా, నారా లోకేష్ పైనా అనుచిత భాషాప్రయోగంతో ఇష్టారీతిగా మాట్లాడే వంశీ ఇప్పుడు మాత్రం అచితీచి మాట్లాడుతున్నారు.
వంశీ అరెస్టును అరెస్టుగానే చూస్తున్నాన్నారు. తాన మౌనానికి కారణం జనం తన ఉద్యోగం ఊడగొట్టడమే అని చెప్పుకున్నారు. అరెస్టులకు భయపడేది లేదు, రెడ్ బుక్ చూడలేదు అంటూ ఒకింత గంభీరంగా మాట్లాడినా, ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ మాత్రం కొడాలి నాని అరెస్టు భయంతో వణికిపోతున్నారన్న సంగతిని తేటతెల్లం చేసింది. మూడు కాదు ముఫ్పై కేసులు పెట్టుకున్న పట్టించుకోనంటూ చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది తెచ్చిపెట్టుకున్న ధైర్యం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.