దేవినేని అవినాష్ ను బుక్ చేసేసిన జగన్!
posted on Feb 19, 2025 @ 9:34AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ తానేం చేస్తున్నారో తనకే తెలియని స్థితిలో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిపోయి.. ఏం మాట్లాడుతున్నారో? ఎక్కడ మాట్లాడుతున్నారో? తెలియని అయోమయస్థితికి చేరుకున్నారా? అంటే వైసీపీ క్యాడర్ నుంచే ఔనన్న సమాధానం వస్తోంది.
జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వల్లభనేని వంశీతో ములాఖత్ ద్వారా భేటీ అయ్యారు. ఆ తరువాత జైలు బయట విలేకరులతో మాట్లాడారు. కూడా తెచ్చుకున్న స్క్రిప్ట్ ను తడబడుతూ చదివేశారు. పేరుగా మీడియా సమావేశం అంటారు కానీ, ఆ మీడియా సమావేశానికి జగన్ అనుకూల మీడియా ప్రతినిథులు వినా మరెవరూ రావడానికి వీల్లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అందుకే జిల్లా జైలు వద్ద జగన్ ను మీడియా అడిగిన ప్రశ్నలన్నీ ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి.
సరే జగన్ నోరు తెరిచారంటే చంద్రబాబు, లోకేష్ లపై ఊకదంపుడు విమర్శలు ఉంటూనే ఉంటాయి. విజయవాడ జిల్లా జైలు వద్ద జగన్ ప్రసంగంలో కూడా అవి అలాగే ఉన్నాయి. అయితే ఈ సారి ఆయన ఆవేశంలోనో, అనాలోచితంగానో సొంత పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ను ఇరికించేశారు. ఇహనో ఇప్పుడో అవినాష్ అరెస్టు కాక తప్పని పరిస్థితిని స్వయంగా క్రియేట్ చేశారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా రెచ్చిపోయి దాడులకు పాల్పడిన కేసుల్లో అవినాష్ కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే ఆ కేసులకు సంబంధించి అవినాష్ అరెస్టు ఇప్పుడప్పేడే ఉండదని అంతా భావిస్తున్నారు. వల్లభనేని వంశీ వంతు అయిపోయింది. తరువాతి వంతు కొడాలి నానిది అని వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. స్వయంగా కొడాలి నాని కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. లోన వణికి పోతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అరెస్టులంటే భయం లేదని చెబుతున్నారు.
కానీ దేవినేని అవినాష్ మాత్రం ఎక్కడా నోరెత్తడం లేదు. పార్టీ కార్యక్రమాలలోనూ క్రియాశీలంగా పాల్గొనడం లేదు. చాలా చాలా లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తూ పోలీసుల దృష్టిలో పడకుండా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నక్కినక్కి అన్నట్లుగా రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ వచ్చారు కనుక తప్పదన్నట్లు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత విజయవాడ జిల్లా జైలు వద్దకూ వెళ్లి జగన్ పక్కన నిలబడ్డారు. అంత మాత్రం దానికే జగన్ త్వరలో అరెస్టు కాబోయే వాళ్లలో దేవినేని అవినాష్ కూడా ఉన్నారని ప్రకటించేశారు. ఇంతకీ ఆయనను ఎందుకు అరెస్టు చేస్తారంటూ ఆయన అందంగా ఉన్నాడు కనక, ఆయనకు ప్రజలలో గ్లామర్ ఉంది కనుక అంతే కాకుండా ఆయన రాజకీయంగా ఎదుగుతున్నారు కనుక అని జగన్ చెప్పారు. అందం, గ్లామర్, రాజకీయంగా ఎదుగుదల విషయాలెలా ఉన్నా.. ఆయనపై కేసులు ఉన్నాయన్న విషయాన్ని జగన్ చాటారు. తద్వారా అరెస్టు చేసే దమ్ముందా? అని పోలీసులకు సవాల్ విసిరారు. అరెస్టు చేస్తే తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత లెక్క తేలుస్తానని హెచ్చరించారు. తద్వారా పోలీసులకు ఇక అవినాష్ కేసులపై దృష్టి సారించక తప్పని పరిస్థితి కల్పించారు. జగన్ పక్కనే నిలబడి ఆయన ప్రసంగం విన్న అవినాష్ కచ్చితంగా తలపట్టుకునే ఉంటారు. గుట్టుగా గడుపుతున్న తనను రోడ్డుకు లాగి, అరెస్టయ్యే పరిస్థితికి తీసుకువచ్చినందుకు ఆయన మనసులో జగన్ ను తిట్టుకునే ఉంటారు.