నో వ్యాక్సిన్- నో లిక్కర్.. మందుబాబులకు షాకింగ్ న్యూస్..
posted on May 31, 2021 @ 4:39PM
నో మాస్క్- నో ఎంట్రీ. ఏ షాపులోకి వెళ్లినా కామన్‌గా కనిపిస్తున్న పోస్టర్. మాస్క్ లేనిదే లోనికి రానివ్వడం లేదు. మాస్క్ లేనిదే సరుకులు ఇవ్వడం లేదు. మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వస్తే అసలేమీ కొనలేం. మాస్క్‌తో పాటు సామాజిక దూరమూ తప్పనిసరి. కానీ, కొందరు పట్టించుకుంటేగా. మాస్క్ పెట్టుకున్నాం కదా.. అని సామాజిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే.. మార్కెట్లు, మద్యం షాపులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మార్కెట్లను ఏమీ చేయలేరు కాబట్టి.. మద్యం షాపులపై పడ్డారు అధికారులు. సరికొత్త రూల్స్‌తో మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇకపై వ్యాక్సిన్ వేసుకున్న వారికే లిక్కర్ అమ్మకం. ఇదే ఇప్పుడు సంచలనం.
కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది ముందుకు రావడంలేదు. దీంతో ఆయా ప్రభుత్వాలు బలవంతంగా వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఉచిత ఆఫర్లూ ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్‌పై జనాలకు ఉన్న సందేహాలే వారు టీకా వేసుకోకపోవడానికి కారణం. ఇక, కరోనా వ్యాప్తికి సూపర్ స్పెడర్లుగా మారిన మందుబాబుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ఎంతైనా మందుబాబులు కదా.. ధరలు పెంచినా.. ఏం చేసినా నోరెత్తరనే ధైర్యంతో వారికే కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు.
వ్యాక్సిన్ వేసుకుంటే రెండు మూడు రోజుల పాటు మందు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. అన్ని రోజులు మద్యానికి దూరం ఉండలేక.. చాలామంది వ్యాక్సిన్‌కే దూరంగా ఉంటున్నారు. మద్యం షాపుల ముందు రద్దీ కూడా కరోనా వ్యాప్తికి మరో కారణం. దీంతో.. వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం అమ్మాలంటూ ఆర్డర్ వేశారు యూపీలోని ఓ జిల్లా అధికారులు.
తాజాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలను జారీ చేసింది. టీకా తీసుకోకుంటే అక్కడ లిక్కర్ అమ్మరు. యూపీలోని ఎటావా జిల్లా యంత్రాంగం మొదటగా ఈ రూల్ తెచ్చింది. ఆ మేరకు లిక్కర్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మందు అమ్మాలని మద్యం షాపు యజమానులకు స్ట్రిక్ట్‌గా ఆదేశాలు ఇచ్చారు. నో వ్యాక్సిన్- నో లిక్కర్.. అంటూ వైన్స్ ముందు పోస్టర్లు అతికించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ అమ్ముతామని బోర్డులు పెట్టారు.
అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇలాంటి ఎన్ని రూల్స్ పెట్టినా.. మందుబాబులను కట్టడి చేయడం ప్రభుత్వాలకు సాధ్యమా? మందు కోసం వారి దారులు వారికి ఉంటాయనే విషయం అధికారులకు తెలియనిదా?