వైసీపీ రౌడీలకు ప్రవేశం లేదు!
posted on Jun 6, 2024 @ 6:11PM
రాజకీయ పార్టీ అంటే నాయకులు, కార్యకర్తల సమ్మేళనం. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు, తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరినట్టు ప్రతిపక్షంలో వున్న పార్టీలో కంటే అధికారంలో వున్న పార్టీలో ఎక్కువమంది నాయకులు, కార్యకర్తలు వుంటారు. అప్పటి వరకు అధికార పార్టీలో వున్న కొంతమంది నాయకులు, కార్యకర్తలు సదరు పార్టీ అధికారం కోల్పోగానే గుడ్ బై చెప్పేసి అధికారంలో వున్న పార్టీలోకి జంప్ జిలానీలు అయిపోతూ వుంటారు. ఎవరో కొద్దిమంది నిబద్ధత ఉన్న నాయకులు, కార్యకర్తలు అధికారం లేకపోయినా తమ పార్టీలోనే కొనసాగుతూ వుంటారు.
తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ అద్భుతమైన పాలన తమకు ఎంతో నచ్చిందని చెప్పి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోగానే, కాంగ్రెస్ పాలన అద్భుతంగా వుందని అంటూ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు నిరంతరం కొనసాగుతూనే వున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్‌కి సున్నా స్కోరు వచ్చిన నేపథ్యంలో ఈ వలసలు మరింత పెరిగి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే, చాలామంది జంప్ జిలానీలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, అప్పటికే వైసీపీలో వున్న తొండలు, ఇతర పార్టీల్లోంచి వెళ్ళిన తొండలు అన్నీ క్రమంగా ఊసరవెల్లుల్లా మారి.. ఆ తర్వాత రౌడీలుగా పరివర్తనం చెంది రాష్ట్రంలో నానా అరాచకాలు చేశాయి. ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో, వైసీపీలో వున్న రౌడీలందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రకరకాల అరాచకాలు చేసి, టీడీపీ కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేసిన వీళ్ళంతా ఇప్పుడు అమాయకపు ముఖాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోదామా అని ఎదురుచూస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన ఎవర్నీ పార్టీలోకి చేర్చుకునే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ లేదు. వైసీపీ రౌడీలకు పార్టీలోకి నో ఎంట్రీ అనే క్లారిటీ పార్టీ నాయకత్వానికి వుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు మోసిన కార్యకర్తలను ఆదుకునే ఉద్దేశంలోనే తెలుగుదేశం పార్టీ వుంది. వైసీపీలో వున్న చెత్తనంతా పార్టీలో చేర్చుకుని, ఇప్పుడున్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశంలో తెలుగుదేశం నాయకత్వం లేదు.