జగన్ వల్లే వైసీపీ ఓటమి.. సత్తిబాబు నిజం ఒప్పేసుకున్నారుగా!
posted on Jun 6, 2024 @ 6:06PM
బొత్స సత్యానారాయణ ఓపెన్ అయిపోయారు. పోలింగ్ తరువాత కూడా వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బొత్స సత్యానారాయణ ఫలితాలు వెలువడిన అనంతరం ఓ రోజు మౌనంగా ఉన్నారు. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే అలా చెప్పి ఊరుకోలేదు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.
అటువంటి బొత్స కుటుంబం ఈ ఎన్నికలలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసిన నియోజకవర్గాలలో ఓటమి మూటగట్టుకున్నారు. బొత్స స్వయంగా తన కంచుకోటలాంటి చీపురుపల్లిలో పరాజయం పాలయ్యారు. విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సతీమణి ఝాన్సీ సైతం ఓటమి పాలయ్యారు. దీతో సహజంగానే ఆయన ఓటమికి కారణాలు చెప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో మీడియా ముందుకు వచ్చిన బొత్స ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి ఊరుకోకుండా వైసీపీ ఘోర పరాజయానికి జగన్ విధానాలే కారణమని కుండ బద్దలు కొట్టేశారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలు, విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, అక్రమ కేసుల కారణంగానే ఓడిపోయామని అన్యాపదేశంగానైనా చెప్పేశారు.