మహారాష్ట్రకు తరలుతున్న ఆంధ్రా పసుపు
posted on Mar 1, 2012 @ 1:03PM
నిజామాబాద్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ జిల్లాలో పండుతున్న పసుపు పంట పొరుగునే ఉన్న మహారాష్ట్రకు తరలిపోతుంది. పసుపు పంటకు మద్దతుధర ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతుధరపై తమగళాన్ని వినిపించినా ఫలితం లేకపోయింది. సిఎం కిరణ్ తీరులో మార్పు కనిపించకపోగా ఆదుకుంటామంటూ నిర్లక్ష్య సమాధానమే మిగిలింది. పసుపు ఉత్పత్తి ఇప్పటికే సగానికి తగ్గిపోగా పెరిగిపోతున్న పెట్టుబడులతో రైతులు అందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ కు పసుపు తరలిస్తూ అయినంతమేర నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పంట ప్రసిద్ది చెందింది. మేలు జాతి వంగడాలతో ఇక్కడి పసుపుకు మంచి గిరాకీ ఉంది. ఆధునాతన వ్యవసాయ పద్ధతులతో సాగుచేసే ఇక్కడి రైతాంగం యావద్దేశానికే ఆదర్శంగా నిలుస్తారు. సహజంగా దొరికే ఎరువుల వాడకం మొదలుకొని నీటి పొదుపు, సన్యరక్షణ పద్దతుల్లో ప్రత్యేకత చాటుతున్నారు. ప్రభుత్వ ఉపాధి అవకాశాలపై ఏమాత్రం ఆధారపడని ఇక్కడి యువత, మహిళలు వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. అయితే వీరికి కావలసిందల్లా సరైన మద్దతుధర. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు పసుపుకు రూ.4వేలు మద్దతుధరగా ప్రకటించింది. నిజానికి రూ.10 వేలు చెల్లిస్తే తప్ప తమకు గిట్టుబాటుకాదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో గత్యంతరం లేక రైతులు పసుపు పొరుగునే ఉన్న మహారాష్ట్రకు తరలిస్తున్నారు.