కోదండరామ్ పై మందకృష్ణ ఆగ్రహం
posted on Nov 2, 2011 @ 2:39PM
న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బుధవారం న్యూఢిల్లీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షకు మద్దతు పలికిన కోదండరామ్ బిసినేత అయిన బాపూజీ దీక్షను స్వాగతిస్తున్నట్లు మాత్రమే ప్రకటించారన్నారు. వారు వారు రెడ్లు కాబట్టి మద్దతు పలికారని అణగారిన వర్గాల దీక్షలకు మాత్రం మద్దతు పలకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణపై కేవలం రాజకీయ శక్తులతో మాత్రమే చర్చలు జరిపి ఊరుకోవద్దని సామాజిక శక్తులతోనూ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు సామాజిక శక్తులను అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలి, కానీ ఈ ప్రాంతంలోని అణగారివర్గాల ఆకాంక్షలను, సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాపూజీ దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మద్దతు ప్రకటించక పోవడం దారుణమన్నారు.