'న్యూ' హిస్టరీ సాధించిన న్యూజీలాండ్
posted on Aug 10, 2020 @ 2:15PM
కరోనా మహ్మమారిని కట్టడి చేసిన దేశం
గత వంద రోజులుగా ఒక పాజిటివ్ రాలేదు
ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న కరోనా కట్టడి పెద్ద సవాల్ గా మారింది. భూగోళంపై ప్రతిదేశంలోనూ వ్యాపించింది. అయితే కట్టడి చేయడంలో మాత్రం కొన్ని దేశాలు విజయం సాధిస్తే మరికొన్ని దేశాలు ఏం చేయాలో అర్థం కాక నివారణ చర్యలను ప్రజలపైనే వదిలేశారు. అయితే 50లక్షల జనాభానే ఉండే చిన్న దేశమైన న్యూజీలాండ్ మాత్రం కరోనా కట్టడిలో విజయం సాధించింది. గత వందరోజులుగా అక్కడ ఒక కొత్త కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ పలువురి నుంచి అభినందనలు అందుకుంటుంది. న్యూజీలాండ్ దేశం కోవిద్ వైరస్ కట్టడికి తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు ఇతర దేశాలకు పాఠాలు అవుతున్నాయి.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే న్యూజీలాండ్ లో చాలా తక్కువ కేసులు నమోదు అయ్యాయి. మరణాలు సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది.
50లక్షల జనాభా ఉన్న న్యూజిల్యాండ్ లో మొదటి కరోనా పాజిటివ్ కేసును ఫిబ్రవరి 26న గుర్తించారు. దాంతో అప్రతమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహిస్తూ లక్షణాలు ఉన్నవారందరినీ క్వారంటైన్ చేశారు. దాంతో ఫిబ్రవరిలోనే 1,219కేసులు బయటపడ్డాయి. వీరిలో 22మంది మరణించారు. వ్యాప్తిని అరికట్టడానికి ఆ దేశం అనేక కఠిన చర్యలను తీసుకుంది. మార్చి 19 నుంచే విదేశాల నుంచి వచ్చేవారిని ఆపేసింది. తప్పనిసరై వచ్చిన వారిని కచ్ఛితంగా క్వారంటైన్ చేశారు. దీంతో అక్కడ కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గింది. చివరి కేసు మే 1న బయటపడింది. అప్పటి నుంచి మళ్లీ పాజిటివ్ కేసులేవి న్యూజీలాండ్ లో నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను నివారించడానికి దాదాపు 65రోజుల పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నుండి బయటపడటానికి న్యూజిలాండ్ మూడు రకాల చర్యలను తీసుకుంది.
- కొత్తగా వ్యక్తులు ఎవరూ దేశంలోకి రాకుండా సరిహద్దులను మూసేశారు. కమ్యూనిటీ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు.
- ప్రజల్లో వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు. తప్పనిసరై బయటకు వచ్చే ప్రజలు మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
- వ్యాధి సోకిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్ చేశారు.
కొత్తగా కేసులు నమోదు కాకపోయినా లక్షణాలు కనిపించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం మాత్రం న్యూజీలాండ్ ప్రభుత్వం ఆపలేదు. తాజాగా 4,249 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో గత వందరోజులుగా ఈ దేశంలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం 23 మంది చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజలందరూ కరోనా కట్టడిని ఒక ఉద్యమంగా తీసుకోవడం, కచ్ఛితమైన నిబంధనలు పాటించడంతోనే ఇది సాధ్యమైందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
ఫిజీ దేశం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టిందని ఆ దేశ ప్రధాని ఫ్రాంక్ బైనీమారామ ట్విట్టర్ ద్వారా తెలిపారు. న్యూజీలాండ్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ 'ఈ భూమి మీద కరోనా వైరస్ ను కట్టడి చేసి గత వందరోజుల్లో ఒక కేసు కూడా రాకుండా నియంత్రించిన దేశాలు ఫిజీ, న్యూజీలాండ్ మాత్రమే' అన్నారు.