మాస్క్ తప్పనిసరి
posted on Aug 10, 2020 @ 3:28PM
ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగాన్ని మోగిస్తున్న కోవిద్ వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ కోసం ఒకవైపు పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు కోట్లాది మందికి ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోంది అన్న విషయంపై అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. కంటికి కనిపించని ఈ స్మూక్ష్మజీవి కేవలం వైరస్ సోకిన పాజిటివ్ వ్యక్తులను కలిసినా, వారితో మాట్లాడినా వస్తుంది. అంతేకాదు పాజిటివ్ వ్యక్తులు తిరిగిన ప్రాంతంలో ఇతరులు తిరిగినా వారి కూడా వస్తుంది అని చెప్పడానికి జపాన్ లో పరిశోధన ఫలితాలే నిదర్శనంగా చెప్పవచ్చు.
జపాన్ ఎన్ హెచ్ కె రిసెర్చ్ ల్యాబ్ లో జరిగిన పరిశోధనలు పరిశీలిస్తే కోవిడ్ 19 వైరస్ కణాలు ఇలా వ్యాపిస్తున్నాయో స్పష్టం అవుతుంది.
క్లోజ్డ్ రూమ్ లో అత్యంత ఆధునిక పద్దతిలో లేజర్ బీమ్స్, హై సెన్సివిటీ కెమెరాలతో గాలిలో ఉన్న వైరస్ ను ట్రాక్ చేశారు. ఈ కెమెరాలు మిల్లీ మీటర్ లో వందోవంతు పరిమాణంలో ఉన్న సూక్ష్మ కణాలను కూడా చూడగలవు. ఈ విధానం ద్వారా గాలిలో ఉన్న 0.1మైక్రో మీటర్ పరిమాణంలో ఉన్న కణాలు కూడా కనిపిస్తాయి. పది మైక్రో మీటర్ల కన్నా చిన్నగా, తేలికగా ఉండే ఈ కణాలు గాలితో సంక్రమణం చెంది సులభంగా ప్రయాణం చేసే విధానాన్ని ట్రాక్ చేశారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాత్రమే కాదు గట్టిగా మాట్లాడినప్పుడు, గట్టిగా గాలి పీల్చినా, విడిచినా ఈ వైరస్ కణాలు గాలిలోకి వ్యాపిస్తాయి అని స్పష్టమైంది.
జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ (టిజెఎఐడి), క్యోటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోవిడ్ వైరస్ వ్యాప్తిపై ప్రయోగాలు చేశాయి. ఫూల్ క్లోజ్డ్ రూంలో తుమ్మిన ఒక వ్యక్తి నుంచి వెలువడే సూక్ష్మకణాలను ఈ కెమెరాలు క్యాప్చర్ చేశాయి. అతని నుంచి వెలువడిన తుంపర్లలో భారమైన కణాలు నేలమీదికి రాగా.. తేలికగా.. చిన్నగా ఉండే వైరస్ కణాలు మాత్రం గాలిలోనే ఉండిపోయాయి . దాదాపు 20నిమిషాల పాటు గాలిలో ఉన్న ఈ వైరస్ కణాలను హై సెన్సివిటీ కెమెరాలు ట్రాక్ చేశాయి.
పాజిటివ్ వ్యక్తి దగ్గినా, తుమ్మినా వెలువడుతాయి అనుకునే ఈ వైరస్ కణాలు ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా నోటి నుంచి బయటకు రావడాన్ని ఈ కెమెరాలు పసికట్టాయి. కాస్త దూరంగా కూర్చోని మాట్లాడినప్పటికీ ఒక వ్యక్తి నుంచి వెలువడే ఈ వైరస్ కణాలు మరోకరికి సులభంగా సోకే అవకాశం ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తుంది.
జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ (టిజెఎఐడి) అధ్యక్షుడు కజుహిరో టాటేడా ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "దగ్గినా, తుమ్మినా వెలువడే స్మూక్ష్మ బిందువులు అనేక రకాల వైరస్ కణాలు వ్యాపించ చేస్తాయి. ఈ కణాలు బయటకు వచ్చి గాలిలో చాలా సేపు ఉంటున్నాయి. అంతేకాదు గట్టిగా మాట్లాడినా, దీర్ఘ నిశ్వాస లోనూ ఈ వైరస్ కణాలు గాలిలోకి విడుదల అవుతున్నాయి. గాలిప్రసారం లేని గదుల్లో అలాగే ఉండిపోాతాయి. ఇలాంటి ఒక గదిలో ఒక మనిషి దగ్గినప్పుడు పదివేల మైక్రో కణాలు బయటకు వస్తాయి. దాంట్లో బరువు ఉన్న కణాలు నిమిషలోనే నేలపై పడిపోతాయి. తేలికైన కణాలు గాలిలోనే తిరుగుతూ ఉండిపోతాయి. ఐదు నిమిషాలైనా, అరగంటైనా అవి అక్కడే ఉంటాయి. ఆ గదిలో ఉన్నవారందరికీ ఈ కణాలు సోకే ప్రమాదం ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎన్ని వైరస్ కణాలును పీల్చితే ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుందో స్పష్టంగా తెలియలేదు" అన్నారు.
క్యోటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మసాషి యమకావా మాట్లాడుతూ "గాలి ప్రసారం లేని క్లోజ్డ్ రూంలలో ఈ వైరస్ కణాలు గాలిలోనే ఉంటున్నాయి. ఇవి తమకు తాముగా ఎటు కదలలేవు. బలమైన గాలిని ప్రసరింపచేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. గాలివెలుతురు లేని గదుల్లో ముఖ్యంగా ఆఫీస్ ల్లో గాలి బలంగా వీచేలా, రూంలోని గాలి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలి. ఎయిర్ ప్లో బాగా ఉన్నప్పుడు ఈ కణాలు బయటకు పోతాయి. చాలా తెలికగా, చిన్నగా ఉండే ఈ కణాలు కాబట్టి స్వయంగా ఎటూ కదలలేవు. కనీసం గంటకు ఒకసారైనా క్లోజ్డ్ గదిలో గాలి ప్రసారం జరిగేలా చూడాలి. ఇది రిస్క్ ను తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం వల్ల గాలిలోకి ఈ వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు" అంటున్నారు.
తేలికైన, చిన్నవైన కణాలు అంటిపెట్టుకుని ఉండే ఈ వైరస్ వ్యాప్తిని నివారించాలంటే మాస్క్ లు ధరించడం తప్పనిసరి.