నితీష్ నేతృత్వంలో బీహార్లో 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
posted on Nov 17, 2025 @ 3:41PM
బీహార్‌లో ఎన్డీఏ గ్రాండ్ విక్టరీ తర్వాత కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరుతుందనే చర్చకు ఎండ్ కార్డ్ పడింది. బీహార్ లో కొత్త సర్కార్ ఏర్పాటుకూ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న నితీష్ నాయకత్వంలో బీహార్ లో మళ్లీ ఎన్డీయే సర్కార్ కొలువుదీరనుంది. దీంతో వరుసగా పదో సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభను ఈ నెల 19న రద్దు చేయనున్నారు. అదే రోజు నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాతి రోజే మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం చేస్తారు. మరోవైపు ఎన్డీయే పార్టీలోని చిన్న పార్టీలు ఇప్పటికే తమకేం కావాలో బీజేపీ పెద్దలకు తెలియజేశాయి. అయితే హిందూస్థానీ అవామీ మోర్చా పార్టీ నుంచి మాత్రం వినూత్న ప్రకటన వచ్చింది. తాము ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని.. తమకు మంత్రి పదవి వచ్చినా.. రాకపోయినా బీహార్ ప్రజల కోసం పనిచేస్తామని తెలిపింది.
ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు దక్కుతాయి, ఏ శాఖ ఎవరికి దక్కుతుంది అన్న విషయంపై సస్పెన్స్ గా మారింది. ఈ ఎన్నికలో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ19, హిందూస్థానీ అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు గెలుచుకున్నాయి. కేబినెట్ కూర్పుపై ఇప్పటికే భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు జరిగాయని సమాచారం.