Read more!

తప్పు చేసినవారిని తిట్టడం మంచిదేనా?

జరిగిపోయిన తప్పుల కన్నా, వాటి తాలూకు జ్ఞాపకాలే మనల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. నిస్సత్తువను ఆవహింపజేస్తాయి. ఎవరెవరు ఏమేమనుకుంటున్నారో? అనే ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తాయి. కానీ ప్రపంచానికి మన పొరపాట్లను పట్టించుకునే తీరిక ఉండదు. ఒకవేళ ఆ క్షణాలకు అది చర్చనీయాంశమైనా, మరుక్షణం లోకం మనల్నీ, మన తప్పులనూ మరచిపోతుంది. వారి నిందలతో మనం నిరాశకు గురి కావలసిన అవసరం లేదు. 'అవును! తప్పు జరిగిపోయింది దాన్ని దిద్దుకునే అవకాశం కూడా నాకే ఉంది' అని మనకు మనమే ధైర్యం నూరిపోసుకోవాలి.  నీకు నీవే తోడూనీడ! తప్పుకు తలదించుకోవలసిన పని లేదు.

తలబిరుసుగా, అహంకారంగా తప్పిదాన్ని సమర్థించు కోవడమూ సరి కాదు. కానీ తప్పు ఎందుకు జరిగిందో విశ్లేషించుకొని, సమీక్షించుకొని సవరించుకోవాలి. అలా కాకుండా బేలగా విలవిల లాడిపోతే మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే ఆంగ్ల మేధావి మార్క్ ట్వెయిన్ 'మనం తప్పిదాల అనుభవం నుంచి అది నేర్పిన విజ్ఞతను మాత్రమే స్వీకరించాలి. లేకపోతే మనం వేడిపొయ్యి మీద కూర్చోబోయిన పిల్లిలా అయిపోతాం. ఆ పిల్లి భవిష్యత్తులో వేడిపొయ్యి మీద కూర్చోవడం అటుంచి, భయంతో ఆరిన పొయ్యి మీద కూడా కూర్చోదు' అంటారు. పొరపాట్లు జరుగుతాయేమో, నిందలు పడాల్సి వస్తుందేమోనన్న అపోహలతో అసలు ప్రయత్నమే మానుకుంటే మనం ఎందుకూ కొరగాకుండా పోతాం!  

మన సహచరుల్లో, సహోద్యోగుల్లో, మన కుటుంబసభ్యుల్లో కానీ ఎవరి వల్లనైనా పొరపాట్లు జరిగితే వాటిని భూతద్దంలో చూస్తూ రాద్దాంతం చేయకూడదు. ఆ వ్యక్తి అపరాధభావంతో కుమిలిపోయేలా ప్రవర్తించకూడదు. ముద్దాయిలా బోను ఎక్కించి, నిందలు, ప్రశ్నలు గుప్పించ కూడదు. ఆ వ్యక్తి స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నాయకుడిగా నలుగురినీ ముందుకు నడిపించాల్సిన వ్యక్తి, తండ్రిగా తన వారికి మార్గదర్శకత్వం వహించి తను ముందు నడవాల్సిన వ్యక్తి తన వారి తప్పులను సహృదయంతో మన్నించగలగాలి. మాటతో కన్నా మౌనంతో వారి మనస్సును మార్చగలగాలి. తాము పొరపాట్లు చేస్తే శ్రీరాముడు ఒక మాట అంటాడని కాకుండా, అన్నయ్య తనే మనస్సులో బాధపడుతూ తమతో మాట్లాడకుండా ఉంటాడేమోనని ఆ తమ్ముళ్ళు ఆలోచించేవాళ్ళట. అంత విశాలహృదయం రఘురాముడిది. అలా తమ వెంట నడిచే వారి తప్పులను సహృదయంతో సరిదిద్దగలిగి ఉండాలి.

ఎదుటివ్యక్తి చేసిన పొరపాటును నలుగురి ముందూ ఎత్తి చూపి, విమర్శిస్తే అతని పరిస్థితి మరింత దిగజార్చినవాళ్ళమవుతాము. వారు తమ తప్పును సవరించుకోవడం వదిలేసి, ఆ అవమానంతో మరింత కుంగిపోతారు. ఇలా మనతో కలసి పనిచేసే వారి తప్పిదాలను పరుషవాక్యాలతో చెణకుతూ ఉత్తమ ఫలితాలను రాబట్టలేం.


                                          *నిశ్శబ్ద.