టీడీపీకి ఎన్డీఏలో పెరుగుతున్న ప్రాధాన్యత..రెండో గవర్నర్ పదవిపై హామీ
posted on Jul 17, 2025 @ 6:29PM
ఢిల్లీలో ఏపీ కేంద్రంగా కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సందర్భంగా జరిగిన చర్చల్లో టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో టీడీపీ మరో సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది.
బీజేపీ అధినాయకత్వం ఎన్డీఏ బలోపేతంలో భాగంగా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత పెంచుతోంది. ఉత్తరాదిన బీజేపీ ఆధిపత్యానికి గండి పడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్న కమలనాథులు ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చే పనిలో పడ్డారంట. త్వరలో బీహార్ .. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాషాయ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీకి కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవిపైన హామీ దక్కింది కాని అమలు కాలేదు. ఈ సారి తొలి ఏడాది పూర్తవుతూనే అశోక్ గజపతికి గవర్నర్ పదవి కట్టబెట్టారు. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి మరింత ప్రాధాన్యత కల్పించాలని మరో గవర్నర్ పదవిపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కితే చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది. అశోక్ గజపతి రాజు కు అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. ఆయన పార్టీ ఆవి ర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటు వివాద రహితుడు. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, బీసీ - ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు సైతం ఈ రేసులో ప్రము ఖంగా వినిపిస్తున్నా ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారంటున్నారు. యనమల సైతం రాజ్యసభకు వెల్లడానికి మొగ్గు చూపుతున్నారంట.
ఆ క్రమంలో రెండో గవర్నర్ పదవి రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది. రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినా ఆయన వయోభారం, ఆరోగ్య పరిస్థితి ప్రతికూలంగా మారాయంటున్నారు. ప్రస్తుతం కేఈ కుమారుడు పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఆ క్రమంలో గవర్నర్ పదవి దక్కించుకునే టీడీపీ సీనియర్ ఎవరన్నదానిపై పార్టీలో విస్తృత చర్చ మొదలైంది.
j