నాయిని పార్టీ మారతారా? కేసీఆర్ పై అసంతృప్తి ఎందుకు?
posted on Dec 17, 2019 @ 9:31AM
నాయిని నర్సింహారెడ్డి... టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కలిసి నడిచిన అతికొద్ది మందిలో ఒకరు. ఉద్యమం సమయం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నాయినికి మంచి ప్రాధాన్యతే దక్కింది. బహిరంగసభ అయినా, కీలక సమావేశమైనా కేసీఆర్ పక్కన కచ్చితంగా నాయిని ఉండేవారు. ఇక, తెలంగాణ ఏర్పడ్డాక కొలువుదీరిన టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో నెంబర్ 2లాంటి హోంమంత్రి పదవికి నాయినికి కట్టబెట్టి సముచిత స్థానం కల్పించారు. నాయినిని అన్నా అని పిలుస్తూ పెద్దరికాన్ని గౌరవించేవారు. అయితే, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నాయిని కనుమరుగు అయ్యారు. ఏడాదిక్రితం వరకు కేసీఆర్ వెంటనడిచిన నాయిని... ఇఫ్పుడా ఎక్కడా కనిపించడం లేదు. కనీసం వాయిస్ కూడా వినిపించడం లేదు.
అయితే, కేసీఆర్-నాయిని బంధానికి 2018లో బీటలుపడ్డాయని అంటారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, ఎమ్మెల్సీని చేసిమరీ హోంమంత్రి పదవి కట్టబెట్టారు కేసీఆర్... 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే మాత్రం టికెట్ నిరాకరించారు. కనీసం తన అల్లుడు శ్రీనివాసరెడ్డికైనా ఇవ్వాలని కోరినా, కేసీఆర్ నుంచి రెడ్ సిగ్నల్ రావడంతో అప్పట్నుంచి సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక, సెకండ్ టర్మ్ లో మంత్రి పదవి కూడా ఇవ్వని కేసీఆర్... నాయిని సేవలను పార్టీకి వాడుకుంటామని హామీ ఇచ్చారట. అయితే, పార్టీపరంగా కూడా ఇఫ్పటివరకు నాయినికి ఎలాంటి పదవీ దక్కలేదు. ఇక, ప్రస్తుతమున్న ఎమ్మెల్సీ పదవీకాలం కూడా మరో మూడు నాలుగు నెలల్లో ముగిసిపోనుంది. దాంతో, కనీసం ఎమ్మెల్సీనైనా రెన్యువల్ చేస్తారో లేదో తెలియని పరిస్థితి నాయిని ఉన్నారు.
కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్న నాయిని...పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో, నాయిని పార్టీ మారతారేమోనన్న ప్రచారం మొదలైంది. అయితే, వయోభారంతో సతమతమవుతోన్న నాయిని... పార్టీ మారినా ప్రయోజనం లేదనే మాట వినిపిస్తోంది. నాయినికి పార్టీ మారే ఆలోచన లేదని, కానీ తన అల్లుడి రాజకీయ కెరియర్ ను చక్కదిద్దాలన్న పట్టుదల మాత్రం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే, కేసీఆర్ పై ఎంత అసంతృప్తి ఉన్నా... గట్టిగా విమర్శలు చేయలేకపోతున్నారని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా మాత్రం కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు. కేసీఆర్ అస్సలు యూనియన్లే వద్దంటే.... అందుకు విరుద్ధంగా నాయిని మాట్లాడారు. యూనియన్లు లేకపోతే కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునేవారే ఉండరని అన్నారు. అయితే,అవేమీ అంతగా పట్టించుకోదగ్గవి కాదంటున్నారు. మొత్తానికి, కేసీఆర్ పై పీకల్దాక అసంతృప్తి ఉన్నా... కక్కలేక మింగలేక అన్నట్లుంది నాయిని పరిస్థితి.