నరేంద్ర మోడీ ప్రధాని పోస్ట్ కి అర్హుడేనా?
posted on Dec 21, 2012 @ 1:12PM
గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నరేంద్ర మోడీ మరో సారి ముఖ్య మంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఈ దశలో అందరి ఆలోచనలు ఆయన దేశ ప్రధాని పదవికి ఎన్డిఏ అభ్యర్ధిగా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు మోడీ ప్రధాని పదవికి అర్హుడా అనే సందేహాలు కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి.
ప్రధాని పదవికి కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ కి సరైన ప్రత్యర్ధి మోడీ నే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ముస్లిం వర్గాల్లో ఆయనకు చెడ్డ పేరు ఉండటమే ఆయన ప్రధాని కావడానికి అసలు అడ్డంకి. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వర్గం జనాభా అధికంగా ఉంది. విజయం సాధించే అభ్యర్దులు కూడా అక్కడ గణనీయంగా ఉన్నారు. ఈ వర్గాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు మోడీ గతంలో ప్రయత్నాలు చేయలేదని కాదు. ఈ విషయంలో ఆయన చెయ్యల్సింది చాలా ఉంది.
నాయకత్వ లక్షణాలను బట్టి చూస్తే, నరేంద్ర మోడీ ఎల్.కే. అద్వాని కన్నా ముందు ఉంటారనడంలో సందేహం ఉండక పోవచ్చు. మోడీ అభ్యర్ధిత్వాన్ని బిజెడి, జెడి (యూ), తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అంగీకరించే అవకాశం ఉండక పోవచ్చు. వి హెచ్ పి లాంటి సంస్థల మద్దతు కూడా ఆయనకు ఇప్పుడు ముఖ్యం.
ఈ పరిస్థితి లో బిజెపికి ఉన్న ప్రత్యామ్నాయం ఒకటే. మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించేవారు ఉన్నా ఆయననే ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం. అంత సాహసం పార్టీ చేస్తుందా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.