ఢిల్లీ పీఠం పై గురి పెట్టిన నరేంద్ర మోడి...?
posted on Dec 22, 2012 @ 1:55PM
గుజరాత్ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి, ముఖ్య మంత్రి పదవిని చేపట్టబోతున్న నరేంద్ర మోడి ఇక దేశ ప్రధాన మంత్రి పదవే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ విజయోత్సవ సభలో ఆయన హిందీ లో మాట్లాడారు. ఇప్పటి వరకూ అక్కడ జరిగిన ప్రతి సభలోనూ ఆయన గుజరాతీలోనే ప్రసంగించేవారు. అయితే, తన సందేశం దేశమంతా అర్ధం చేసుకొనేలా మోడి హిందీ లో మాట్లాడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దేశమంతా సుపరిపాలన అనే పదాలు కూడా మోడి ఇక్కడ వాడారు. తనను ఎన్నుకొని, గుజరాతీయులు దేశానికి మార్గం చూపారని మోడి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయనకు ప్రధాని పదవిఫై ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నాయని భావిస్తున్నారు.
పార్టీలోని సీనియర్ నేతలు అద్వాని, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, యశ్వంత్ సిన్హా వంటి నేతలు ఒక్కొక్కరు ప్రధాని పదవి విషయంలో మోడీ కి మద్దతుదారులుగా మారుతున్నారు. అయితే, బిజెపి లోని ఓ వర్గం మోడి ప్రధాని పదవికి గండి కొట్టే పనిలో ఉంది. ఎన్డిఏ లోని కొన్ని పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయి.
ఇక బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ గురించి చెప్పనక్కరలేదు. మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే, ఎన్డిఏ ఫై మతతత్వ ముద్ర పడి తిరిగి అధికారంలోకి రావడం కష్టమవుతుందని నితీష్ వాదిస్తున్నారు. వచ్చే సంవత్సరంలో కర్ణాటక లో జరిగే ఎన్నికల ప్రచారం లో పాల్గొని, అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగితే, మోడి ప్రధాని కావడానికి అడ్డంకులు ఉండకపోవచ్చనేది పరిశీలకుల అంచనా.