బుజ్జగింపులు.. బెదిరింపులు.. ఇదీ మోడీ స్టైల్!

వయసు దగ్గర దగ్గర 75 సంవత్సరాలకు చేరువ అవుతోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో కూడా వున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మిగతా రాజకీయ నాయకులను విమర్శించినట్టు ఘాటుగా విమర్శించాలంటే కొంత ఇబ్బందిగానే వుంటుంది. అందుకే పెద్దమనిషి వయసుకి, హోదాకి గౌరవం ఇస్తూ చాలా వినయంగా అసలు విషయాన్ని తెలియజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికలలో 4 వందల పార్లమెంటు స్థానాలు గెలిచి ప్రధానమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చోవాలని ఆశిస్తున్నారు. ఆయన అలా ఆశించడంలో తప్పులేదు.. జనం ఆశీస్సులతో అనుకున్నట్టు జరిగినా బాధ లేదు. కానీ, ఆయన ఎన్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 

నరేంద్ర మోడీ నాయకత్వంలో వున్న బీజేపీ నాయకులు ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారో మళ్ళీ ఇక్కడ ఉదహరించాల్సిన అవసరం లేదు. ముస్లిం ఓట్లు బీజేపీకి ఎంతమాత్రం పడవన్న విషయం కూడా ఎవరూ విస్మరించలేనిది. కొన్ని రాష్ట్రాల్లో పేద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. దాని విషయంలో మోడీ గారి సహచరుడు అమిత్ షా తన పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నారు. సరే, అధికారం మళ్ళీ వస్తే వీళ్ళకు ఎలా చేయాలని అనిపిస్తే అలా చేస్తారు. దేశం ఆ నిర్ణయాన్ని ఇష్టం లేకపోయినా భరించక తప్పదు. ముస్లింల విషయంలో అలా వ్యవహరిస్తూనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం నాడు మోడీ గారు అద్భుతమైన కొన్ని మాటలు జనం మీదకి వదిలారు. ‘‘హిందు, ముస్లిం అని నేను విడదీయను. చిన్నప్పుడు ఈద్ కూడా జరుపుకునేవాడిని. పక్కింటి ముస్లింలు మాకు ఆహారం పెట్టేవారు’’ అని ప్రేమతో కూడిన మాటలు చెబుతున్నారు. గోధ్రా దుర్ఘటన సందర్భంగా గానీ, కేంద్రంలో అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గానీ, ఆయన పార్టీ వారుగానీ ముస్లింల విషయంలో చేసిన వ్యాఖ్యానాలు వారికి గుర్తుండక పోవచ్చుగానీ ముస్లింలు మరచిపోరు కదా.

సరే, ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేస్తూ మోడీ గారు ఒక దారుణమైన మాట అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని వాళ్ళు కూల్చేస్తారట. ఇంతకంటే దారుణమైన స్టేట్‌మెంట్ మరొకటి వుంటుందా? ఇది మతం పేరుతో రాజకీయాలు చేయడం కాదా? ‘మోడీ’ అనే పేరును తిట్టినందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేయించారు. మరి మతం పేరుతో రాజకీయ విమర్శలు చేసినందుకు ఏం చేయాలి? 

Teluguone gnews banner