మోడీ బంగ్లా పర్యటన మరో దౌత్య విజయం
posted on Mar 27, 2021 @ 12:53PM
దేశాది నేతలు, ప్రభుత్వాధినేతలు విదేశీ పర్యటనలు చేయడం విశేషం కాదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జరిపిన బంగ్లాదేశ్ పర్యటనకు నిస్సందేహంగా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కరోనా కాలం మొదలైన తర్వాత ప్రధాని జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం, పర్యటన ప్రత్యేకత అయితే, పర్యటన సందర్భం, ఈ సందర్భంగా ప్రదాని మోడీ చేసిన ప్రసంగం పర్యటన ప్రాధాన్యతకు అద్దం పడుతోంది.
బంగ్లాదేశ్ స్వాతంత్ర స్వర్ణోత్సవాలు, ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయతి వేడుకలలో ప్రధానమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 2020కి సంవత్సరానికి గానూ, మన ప్రభుత్వం షేక్ ముజిబుర్ రెహమాన్’కు ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని,షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆమె సోదరి షేక్ రహీనాలకు అందచేశారు. ఈ విశేష కార్యక్రమాలు భారత్, బంగ్లా బంధాన్ని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశాయి. అంతే కాదు ఇరు దేశాల పొరుగు దేశం పాకిస్థాన్ దుష్ట పన్నాగాలను, దుర్మార్గ పోకడలను కూడా గుర్తు చేసింది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రసంగంలో అన్యాయాన్ని ప్రతిఘిటించి, ధర్మాన్ని కాపాడే క్రమంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో త్యాగధనులు తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. వంచన, అణచివేతపై సత్యం, ధైర్యం సాధించిన గొప్ప విజయానికి బంగ్లా విముక్తి పోరాటం గుర్తుగా నిలుస్తుందని ప్రస్తావించడం ద్వారా ఇప్పటికీ అదే రీతిన సాగుతున్న పాకిస్థాన్ దుర్నీతిని ప్రపంచానికి గుర్తు చేశారు.
అలాగే, ఉభయ దేశాల బంధాన్ని, ప్రధాని రక్త బంధంగా వర్ణించారు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉండే సబంధం, కాదు, మన మరో పొరుగు దేశం పాకిస్థాన్’తో ఉన్నటువంటి దాయాది వైరుధ్య బంధం కాదు, ఒకే అమ్మ రక్తం పంచుకు పుట్టిన రక్త సంబంధమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.ఇంకా అనేక విధాలుగా ఉభయ దేశాల మధ్య గల స్నేహ సంబంధాలను ప్రస్తావించడం ద్వారా, ఉభయ దేశాల బంధాన్ని మరింతగా బలోపేతం చేసే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం మన దేశ సరిహద్దులలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనకు దౌత్యపరమైన ప్రాధాన్యత కూడా వుంది.అందుకే, పాక్, చైనా దుష్ట బంధాల నేపధ్యంలో ప్రధాని పర్యటనకు ఎంతో ప్రాముఖ్యత ఉందని దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు జరిపిన ప్రతి విదేశీ పర్యటన, దౌత్య పరంగానే కాదు, ఆర్థికంగా, వ్యాపార వాణిజ్య సంబంధాల పరంగా, రక్షణ సంబంధాల పరంగా, ఎలా చూసినా, దేశ హితమే కనిపిస్తుంది. బంగ్లా పర్యటనలో కూడా అదే నీతి కనిపించింది.