హామీలన్నీ నీటి మీద రాతలేనా?
posted on Feb 28, 2015 @ 9:29PM
ఈరోజు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలందరూ అసంతృప్తి చెందినట్లు బహిరంగంగానే చెప్పారు. అయినప్పటికీ వారెవరూ కూడా మిత్రపక్షమయిన బీజేపీకి, తాము భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి తీవ్ర విమర్శలు చేయలేదు. తమ ప్రయత్నలోపం లేకుండా మళ్ళీ మరొకసారి ప్రధాని మోడీని, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్ర పరిస్థితి మరోమారు వివరించి అధనపు నిధుల విడుదలకు కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ చంద్రబాబు ఒత్తిళ్ళకి మోడీ ప్రభుత్వం ఎంతమాత్రం తలొగ్గబోదని ఇప్పటికే నిరూపితమయింది. ఆయన ఎన్నిసార్లు డిల్లీ ప్రదక్షిణాలు చేసినప్పటికీ కేంద్రం తను ఈయదలచున్నదే ఇస్తోందే తప్ప అధనంగా ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ తదితరులు ఇంతవరకు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అందుకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రానికి మంచి ప్యాకేజి ఇస్తామన్నారు. ఏదో మొక్కుబడిగా ఇచ్చేరు కూడా. కానీ అది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏవిధంగా కూడా ఉపయోగపడదని చంద్రబాబు నాయుడే స్వయంగా కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు. కనుక ఈ విషయంలో కేంద్రం మాట తప్పినట్లయింది.
రాష్ట్రానికి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం పదేపదే హామీలు ఇచ్చింది. మొన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో ఆ ప్రసక్తి ఎందుకు లేదో రైల్వే మంత్రి వివరణ ఈయలేదు. రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని మోడీ స్వయంగా ఎన్నికల ప్రచార సమయంలో పదేపదే హామీ ఇచ్చేరు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని విధాల సహాయపడతామని హామీ ఇచ్చేరు. కానీ వేల కోట్లు వ్యయం అయ్యే పోలవరం ప్రాజెక్టుకి కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించడంతో చంద్రబాబు నాయుడే ఆశ్చర్యపడ్డారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఆయన రాష్ట్ర ప్రజలకు పదేపదే హామీ ఇచ్చేరు. కానీ కేంద్రం మొక్కుబడిగా నిధులు విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటికయినా పూర్తి చేయగలమా? అని ఆయన ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణం కోసం తొలివిడతగా కనీసం రూ.20, 000 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించాలని ఆయన కోరితే బడ్జెట్ లో అసలు ఆ ప్రసక్తే లేదు. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే వేడుకొన్నా మోడీ కనికరించలేదు. హూద్ హూద్ తుఫాను వల్ల రాష్ట్రానికి సుమారు రూ.61, 000 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తే కేంద్రం రూ.1,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన మోడీ మళ్ళీ అందులో సగం మాత్రమే ఇచ్చేరు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ ఏర్పాటు, బడ్జెట్ లోటు పూడ్చుకొనేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయింపులు వంటి హామీలను కేంద్రం పట్టించుకొన్నట్లు లేదు. కేంద్రం ఇక మున్ముందు కూడా ఇటువంటి వైఖరే అనుసరించేమాటయితే దాని వల్ల తెదేపా-బీజేపీల మధ్య సంబంధాలు ఎలాగూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల తోడ్పడుతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఈవిధంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కూడా ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంటుంది. కనుక బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో తన పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించవలసి ఉంటుంది.