మోడీ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలు
posted on May 26, 2014 @ 8:58PM
ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణం చేసారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చాలా విశేషాలు ఉన్నాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాలకు చెందిన దాదాపు 4,000 మంది హాజరయ్యారు. వారిలో సార్క్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, వివిధ దేశ ప్రతినిధులు, మన దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పద్మా అవార్డు గ్రహీతలు, అధికార, ప్రతిపక్ష నేతలు, 777 మంది పార్లమెంటు సభ్యులు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అనేకమంది కాంగ్రెస్ నేతలు, సినిమా తారలు, క్రికెట్ ఆటగాళ్ళు, కొందరు సాధువులు, పారిశ్రామిక వేత్తలు ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
వారందరి భద్రత నిమిత్తం రెండు రోజుల ముందు నుండే భద్రతా దళాలు డిల్లీని జల్లెడపట్టి, రాష్ట్రపతి భవన్ పరిసరాలను పూర్తిగా దిగ్బందం చేసి తమ అదుపులో ఉంచుకొన్నారు. అంతేగాక రాష్ట్రపతి భవన్, ఆ పరిసర ప్రాంతాలలో భద్రతాదళాలు హెలికాఫ్టర్లతో గగనతలం నుండి కూడా పహారా కాసాయి.
దూరదర్శన్ మరియు అనేక వందలాది ప్రవేట్ టీవీ ఛానల్స్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, దేశ విదేశాలలో ప్రజలు వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ వారు మొత్తం 9 కెమెరాలతో, ఒక బ్రాడ్కాస్టింగ్ వ్యానుతో ఒకేసారి 15 బాషలలో ప్రత్యక్ష ప్రసారం చేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి యూపీయే మంత్రి వర్గానికి, మోడీ మంత్రి వర్గానికి, సార్క్ దేశాల ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు.