న్యాయమే గెలిచింది.. తెలుగు 'విన్'
posted on Sep 12, 2020 @ 3:28PM
అధికారం మా చేతిలో ఉందంటూ నియంతృత్వ పోకడలకు పోయే ప్రభుత్వాలకు న్యాయ స్థానాల్లో భంగపాటు తప్పదని మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అభ్యంతరకర వార్త ప్రసారం చేసిందని ఆరోపిస్తూ 'తెలుగు వన్' సంస్థపై సీఐడీ పోలీసులు ఏప్రిల్ 29వ తేదీన అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అర్థరాత్రి పూట సీఐడీ అధికారులు మా తెలుగు వన్ ఆఫీస్ లో సోదాలు నిర్వహించి.. సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్ తో దురుసుగా ప్రవర్తించి.. ఆఫీస్ కి సంబంధించిన సిస్టమ్స్, హార్డ్ డిస్క్ లు పట్టుకెళ్లారు.
కేసులు పెట్టినా, విలువైన కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ లు పట్టుకెళ్లినా.. మా సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్ గారు కానీ, మా సంస్థ కానీ ఏ మాత్రం భయపడలేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మా సంస్థపై వేధింపులకు దిగారు. ఇలాంటి వేధింపులు, ఒత్తిళ్లు భరించలేక కొందరు తమ వ్యాపారాల కోసం అధికార పార్టీ పంచన చేరారు, వారికి బాకా ఊదారు. కానీ మా అధినేత అలా చేయలేదు. "ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు తల దించుకోవాలి. అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. కానీ నిజాయితీ, న్యాయం ఎప్పటికీ నిలబడతాయి" అంటూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయన పోరాట పటిమని చూసి పలువురు రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు సైతం ఆశ్చర్యపోయారు.
న్యాయ పోరాటానికి దిగిన మా సంస్థ అధినేత తెగింపుకి, నిజాయితీకి విశేష మద్దతు లభించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సంస్థపై దాడి చేసి, ఆయనపై కేసు పెట్టారని ఆరోపిస్తూ అప్పట్లో పెద్ద ఎత్తున యువత సోషల్ మీడియాలో గళం వినిపించారు. మరోవైపు, తాను న్యాయం, నిజాయితీని నమ్ముకున్నానని.. ఇలాంటి వేధింపులు, బెదిరింపులకు భయపడేది లేదని.. న్యాయపోరాటం చేసి గెలిచి తీరుతానని స్పష్టం చేసిన మా అధినేత.. చెప్పినట్టుగానే బెయిల్ పొంది మొదటి విజయాన్ని సాధించారు. ఇక, తాజాగా హైకోర్టు ఈ కేసుని కొట్టివేయడంతో ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని రుజువు చేశారు.
తమపై పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని కోరుతూ మా సంస్థ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి అధికారుల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. కేసు నమోదు, దర్యాప్తుతోపాటు.. చానల్ కు చెందిన ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ ను స్వాధీనం చేసుకున్న తీరు చూస్తే అధికార పార్టీని సంతృప్తి పరిచేందుకే చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “పార్టీలు అధికారంలోకి రావచ్చు. కొంతకాలానికి పోవచ్చు. అధికారులు రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా పని చేయాలి." అని హితవు పలికారు. "ప్రజాస్వా మ్యంలో ఉన్నప్పటికీ.. చట్టం పట్ల కనీస అవగాహన, శాఖపై పాలనాపరమైన నియంత్రణ లేని అధికారుల వల్ల ఖాకీస్టోక్రసీలో(దారుణమైన పాలనలో) జీవిస్తున్నామనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారు” అని ఆగ్రహించారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి.. పిటిషనర్ పై కేసు నమోదు చేశారని.. ఇది చట్ట విరుద్ధమని ఆగ్రహించారు. పిటిషనర్ పై సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని వెంటనే వెనక్కి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇది మా విజయం కాదు. నిజాయితీకి, న్యాయానికి దక్కిన గౌరవం. అధికారం చేతుల్లో ఉందికదా అని మమ్మల్ని వారి గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసారు. కానీ మేం న్యాయపోరాటం చేసి గెలిచి తగిన గుణపాఠం చెప్పాం. అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. మీ తాటాకు చప్పుళ్ళకు మేం భయపడం. మీ రాయలసీమ పాలెగాళ్ల పాలనలో ఎందరో అమాయకులు బలయ్యారు. మేం వాళ్ళలాగా బలికాము, వాళ్ళ గళమై వినిపించి మీ పనిపడతాం. మీ బెదిరింపులు, రౌడీయిజాలు, నియంత పోకడలు.. మా నిజాయితీ ముందు నిలబడలేవు. న్యాయాన్ని గెలిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఎవరితోనైనా తలబడతాం. మా గెలుపు మీకు చెంపపెట్టు లాంటిది.
తెలుగు వన్ ఎప్పుడూ ఒకరికి కొమ్ము కాయలేదు.. ఒకరికి బాకా ఊదలేదు. ఎప్పుడూ నిజాయితీగానే పని చేసింది. ఇక మీదటా అలాగే పనిచేస్తుంది. అధికార మదంతో, మీ వాపు బలంతో.. మా గొంతు నొక్కాలని చూస్తే.. అంతకు వెయ్యి రెట్లు మా గళాన్ని వినిపిస్తాం. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం, ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరినైనా ఎదిరిస్తాం. మధ్యమధ్యలో వచ్చే ఈ బెదిరింపులు, వేదింపులకు న్యాయపోరాటంతోనే గెలిచి సమాధానం చెప్తాం.
మా ఈ న్యాయ పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా అధినేతకు బెయిల్ రావడానికి కృషి చేసిన ఉమేష్ గారికి, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి న్యాయ పోరాటంలో పాలుపంచుకున్న 'అంబటి అండ్ అవధాని అసోసియేట్స్'కి కృతజ్ఞతలు. అలాగే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తున్న ఈటీవీ, టీవీ5 తో పాటు ఇతర మీడియా సంస్థలకు ధన్యవాదాలు. ఇక మా సంస్థకు మద్దతుగా నిలిచి గళం వినిపించిన లక్షల మంది సామాన్యులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం.