చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని.. అందుకేనా?
posted on Aug 23, 2022 @ 3:31PM
రాజకీయ లబ్ధి కోసం పార్టీల నేతలు ఎప్పటికి ఏది అవసరమో అది నిస్సంకోచంగా చేసేస్తారనడంలో ఏమాత్రం అనుమానం ఉండక్కర్లేదు. నాలుగు ఓట్లు తమకు వస్తాయంటే.. ఎక్కడికైనా వెళ్లారు.. ఎవరితోనైనా కలిసిపోతారనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అందుకేమే మినహాయింపు కాదని చెప్పుకోవచ్చు. కొద్ది నెలల క్రితం వరకూ బూతుల మంత్రిగా ప్రసిద్దుడైన కొడాలి నాని జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా మిగిలారు. పదవి పోయినప్పటి నుంచీ మీడియాలో గానీ, పబ్లిక్ లో గానీ అంతగా కనిపించడం బాగా తగ్గించేశారు కొడాలి నాని.
అయితే.. తాజాగా సెప్టెంబర్ 22 (సోమవారం)న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో ఆయన అభిమాన సంఘం నిర్వహించిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. ఆయన చిరంజీవి అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం రాజకీయ వర్గాలనే కాకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముందనే సందేహం ఎవరికైనా కలగొచ్చు. అందుకు సమాధానం కూడా ఉంది. గతంలో ఏనాడూ కొడాలి నాని ఇలా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇప్పుడు మంత్రి పదవి పోయి, పబ్లిక్ లోనూ కొడాలి నాని అంతగా కనిపించకపోవడంతో జనానికి ఆయన కాస్త దూరమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుటుంబానికి కొడాలి నాని వీర విధేయుడనే పేరు ఉంది. ఆ క్రమంలోనే నాని జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. అలాంటి కొడాలి నాని ఈ సారి చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం గుడివాడలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చిరు వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడం వెనుక రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహం ఏదో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ద్వారా గుడివాడ నియోజకవర్గంలో 30 వేలకు పైగానే ఉన్న కాపు సామాజికవర్గం దృష్టిని ఆకర్షించడం, తద్వారా వారి ఓట్లకు గాలం వేయడం అనే వ్యూహం మేరకే కొడాలి నాని చిరంజీవి అభిమానుల సంఘం నిర్వహించిన చిరు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని అంటున్నారు.
నిజానికి కొడాలి నానికి ఈసారి గుడివాడ నుంచి వైసీపీ టికెట్ వచ్చినా.. గెలవడం అంత సులువు కాదనే ఊహాగానాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు వరుసగా గుడివాడ నుంచి ఎన్నికవుతూ వచ్చిన కొడాలి నానికి ఈ సారి గెలుపు నల్లేరు మీద నడక కాదంటున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని కాపు ఓట్లపై కన్నేశారంటున్నారు. గతంలో ఏనాడూ లేనిది ఈ సారి చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం వెనుక కొడాలి నాని రాజకీయ వ్యూహం ఇదే కావచ్చని అంటున్నారు. వాస్తవానికి ఏపీలో వైఎస్ జగన్ పాలనపైన, అభివృద్ధి జరగని తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదే ప్రభావం గుడివాడ నియోజకవర్గంలో కూడా ఉందంటున్నారు. దీంతో కొడాలి నానిలో ఓటమి భయం పట్టుకుందని, ఈసారి తాను గెలవాలంటే.. కాపుల ఓట్లను ఆకర్షించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే గుడివాడలో చిరంజీవి అభిమాన సంఘాల నేత తోట సాయి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారని చెబతున్నారు. అక్కడితో ఆగని కొడాలి.. తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథా నాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచింది. దాంతో పాటుగా భగవంతుని ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కూడా కొడాలి నాని ఆకాంక్షించడం విశేషం. మెగాస్టార్ గురించి కొడాలి నాని ఇంతలా పొగిడిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు, ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న మెగా అభిమానుల మనసు దోచుకోవడం కోసమే నాని ఇలా చిరు అభిమానిగా అవతారం ఎత్తారని పరిశీలకులు అంటున్నారు.
అయితే.. చిరంజీవి చిన్న సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తరచుగా విమర్శలు చేసే కొడాలి నానికి కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయా? మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు అనుమానమే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సవాల్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.