ఈ తప్పులే జగన్‌ను ముంచాయా..?
posted on Aug 28, 2017 @ 5:09PM
హోరాహోరిగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో సర్వేలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ విజయ దుంధుభి మోగించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 19 రౌండ్లు కౌంటింగ్ జరిగితే కేవలం ఒకే ఒక్క రౌండ్‌లో శిల్పా టీడీపీపై ఆధిక్యత సాధించగా..మిగిలిన రౌండ్లలో తెలుగుదేశం హవా స్పష్టంగా కనిపించింది. ఈ విజయం రాజకీయ విశ్లేషకులను ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఖంగు తినిపించింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి విజయం వైసీపీదేనని చాలా సర్వేలు చెప్పాయి..టీడీపీ గెలిచినా చాలా తక్కువ మెజార్టీ మాత్రమే వస్తుందని నిన్న, మొన్నటి లగడపాటి సర్వే తెలిపింది. అయితే టీడీపీకి ఇంతటి అఖండ విజయం సాధించడానికి ఒకేఒక్కడు కారణం..ఆ ఒక్కడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవును మీరు వింటున్నది నిజమే..ఆయన వ్యూహత్మకంగా చేసిన తప్పిదాలు సైకిల్‌కు రాచబాటను ఏర్పరిచి తెలుగుదేశం విజయానికి కారణమయ్యాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు
అవేంటో ఒకసారి చూస్తే:
* నంద్యాలలో గెలుపే లక్ష్యంగా 11 రోజుల పాటు అక్కడే మకాం వేశారు జగన్..నాయకుడు అన్నవాడు మంది మార్భాలన్నీ జనంలో మోహరించాలి..కానీ వైసీపీ అధినేత మాత్రం తన చుట్టూ తిప్పుకున్నాడు..ఎక్కడికి వెళితే అక్కడికి..తాను ఏం చేస్తే ఆ పని చేయించారు.
* ప్రచారం తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నడిరోడ్డుపై "కాల్చాలి..ఉరి తీయాలంటూ" చేసిన వ్యాఖ్యలు జనాల్లోకి బాగా వెళ్లాయి..
* ఇక మైక్ దొరికితే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయే రోజా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళ, మంత్రి భూమా అఖిలప్రియ వస్త్ర ధారణ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు..వైఎస్ వేసిన రోడ్లపై సీఎం తిరుగుతున్నారనడం, నారా లోకేష్‌ను వాడు-వీడు అనడం ఇలాంటి మాటలు వైసీపీకి చేటు చేశాయి.
* ప్రతిపక్షం అంటే విమర్శించడం ఒక్కటే పనిగా పెట్టుకోవాలి. ఈ మూడున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందనో ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబును జనం ముందు దోషిగా నిలబెట్టవచ్చు కానీ ఇదేమీ చేయకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు జగన్.
* ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి అక్కడ టికెట్ రాలేదన్న అక్కసుతో వైసీపీలోకి వచ్చిన శిల్పా బ్రదర్స్ జనానికి నమ్మకం కలిగించలేకపోయారు. శిల్పా చక్రపాణి లక్షలాది మంది సమక్షంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా వారు నమ్మలేదు..బహుశా రేపు వైసీపీ తరపున గెలిచి మళ్లీ గోడ దూకరన్న గ్యారంటీ ఏంటీ అని జనం అనుకోని ఉండవచ్చు.
* నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలను దశాబ్ధాల పాటు మకుటం లేని మహారాజులా ఏలారు భూమా నాగిరెడ్డి. మంచి చేశాడో..చేడు చేశాడో ఏమైతే ఏంటీ. ఆ ప్రాంతానికి పెద్ద దిక్కులా ఉన్నారు భూమా. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు సహజంగానే సానుభూతి ఉంటుంది. దానిని టీడీపీకి దక్కకుండా చేయడానికి భూమా ఫ్యామిలీపై లేనిపోని విమర్శలు చేసింది వైసీపీ. ఇంకేముంది పాపం తల్లితండ్రీ లేని ఆడకూతుళ్లు ఎంత కష్టపడుతున్నారో..ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని నంద్యాల ఓటరు భావించి ఉండవచ్చు.
* నంద్యాల ఎన్నికలను ఎప్పటి నుంచో ప్రభావితం చేస్తోన్న గోస్పాడు మండలంలో పెద్ద దిక్కుగా ఉన్న గంగుల బ్రదర్స్‌కి జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గంగుల ఇంపార్టెన్స్ తెలుసుకున్న సీఎం చివరి నిమిషంలో గంగుల ప్రతాపరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి లాభపడ్డారు.
* లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ప్రశాంత్ కిశోర్. 2019 ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తాడన్న నమ్మకంతో బోలెడు ఖర్చుపెట్టి మరీ "పీకే"ని తెచ్చిపెట్టుకున్నాడు జగన్. పాపం రాష్ట్రమంతా సర్వే చేసిన ప్రశాంత్ దేవినేని అవినాష్‌ను కాపు అని...వంగవీటి రాధాను కమ్మ అని నివేదిక ఇచ్చాడట. ఉత్తరాదికి చెందిన ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లోని కుల సమీకరణలు, లెక్కలు గురించి కనీస అవగాహన లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. నంద్యాల లెక్క కూడా అలాగే తప్పి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు.