సాగర్ బీజేపీలో తిరుగుబాటు?
posted on Mar 27, 2021 @ 10:52AM
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీలో తిరుగుబాటుకు కారణమవుతుందని తెలుస్తోంది. సాగర్ నామినేషన్ల ప్రక్రియలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం ఆయన పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో వీళ్లు ప్రచారం కూడా చేస్తున్నారు.
పార్టీ తనకే టికెట్ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో నామినేషన్ దాఖలు చేసినట్లు నివేదితా రెడ్డి చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోక ముందే నివేదిత నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించని పక్షంలో రెబల్‌గా బరిలో ఉంటుందా.? లేక ఉపసంహరించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిత నామినేషన్ దాఖలు చేసి ఓ రకంగా ఆ పార్టీని ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.
నాగార్జున సాగర్ లో అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన పడుతోంది. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. అధికార పార్టీ నుంచి బీసీ వ్యక్తి అభ్యర్థిగా ఉంటారని తెలుస్తోంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఖరారు అయ్యాకా... సామాజిక కోణంలో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. సాగర్ లో యాదవులతో పాటు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు వార్గాల నుంచే బీజేపీ అభ్యర్థి ఉండవచ్చని చెబుతున్నారు. కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆలోచన ఇలా ఉంటే.. కంకణాల నివేదితా రెడ్డి నామినేషన్ వేయడం ఇప్పుడు బీజేపీలో కాక రేపుతోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 23 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు. 30వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.