తుస్సుమన్న నాగం కేసు
posted on Feb 16, 2015 @ 11:56AM
భారతీయ జనతా పార్టీ నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టేసింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో వున్న చెస్ట్ ఆస్పత్రిని హైదరాబాద్ నగర శివార్లకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. అయితే ఇది విధానపరమైన నిర్ణయమని, దీనికి ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అంటు వ్యాధులకు చికిత్స చేసే వైద్యాలయం నగర శివార్లకు తరలిస్తే మంచిదేకదా అంటూ వ్యాఖ్యానిస్తూ నాగం దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసు విషయం ఇలా వుంటే, చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరో కేసు దాఖలైంది. చెస్ట్ ఆస్పత్రిలోని చారిత్రక కట్టడాలను కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభాకర్ అనే వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఈ చారిత్రక కట్టడాలకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది.