అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి పరాయివాడేనా?
posted on May 14, 2024 @ 10:53AM
ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది. ఎంత మిత్రుడైనా నంద్యాల వెళ్లి మరీ మద్దతు తెలపడానికి ఇదా సమయం అంటూ విస్తృత చర్చ జరిగింది. సరే దానికి అల్లు అర్జున్ పార్టీలతో సంబంధం లేదు.. ఫ్రెండ్ అయితే చాలు ఎంత దూరం వెళ్లైనా మద్దతు తెలుపుతా అని చెప్పాడనుకోండి అది వేరే సంగతి. అంతకు ముందు పవన్ కల్యాణ్ కు మద్దతుగా కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ తీరు మెగా ఫ్యామిలీలో ఆయనకు పెద్దగా పొసగడం లేదా అన్న అనుమానాలకు అయితే తావిచ్చింది.
తాజాగా జనసేన నేత, స్వయంగా పవన్ కల్యాణ్ కు అన్నయ్య అయిన నాగబాబు ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు మావాడైనా పరాయివాడేనంటూ నాగబాబు చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇంటికెళ్లి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై ఈసీ కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినదేనని అంతా భావిస్తున్నారు.
పిఠాపురంలో పోటీచేస్తున్న జనసేనాధిపతి, తన స్వంత మేనమామకు స్వయానా సోదరుడైన పవన్ కల్యాణ్‌కు మద్దతునివ్వని అల్లు అర్జున్ వైసీపీలోని తన మిత్రుడి విజయం కోసం ప్రచారం చేయడంపై మెగా ఫ్యాన్స్ ఫైరయ్యారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు మెగా అభిమానులకు మద్దతుగా అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ ట్వీట్ చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.