ఒక మేయర్! ముగ్గురక్కలు!
posted on Apr 29, 2020 @ 11:44AM
కొవిడ్-19 రోగులకు చికిత్స అందించడం కోసం ముంబాయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ నర్సుగా మారారు. నాయర్ ఆసుపత్రిలో రాత్రిపూట సేవలందిస్తున్నారని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
ముంబాయి కోసం ఏమైనా చేస్తాం. మేం ఇంటి దగ్గర నుంచి పని చేయలేం. ప్రజల కోసం క్షేత్ర స్థాయికి వెళుతున్నాం. మీరు మీ ఇంట్లో భద్రంగా ఉండండి అని ముంబాయి పౌరులను ఉద్దేశించి మేయర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇంటి నుంచి బయటికి వచ్చి పనిచేస్తున్నారు. లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తున్నారు. లాక్‌డాన్ అమల్లోకి వచ్చినప్పట్టి నుంచి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు సీతక్క. ఉపాధి కోల్పయిన పేదవారికి నిత్యావసర సరుకులు అందించాలని సోషల్ మీడియా మిత్రులను ఆమె కోరారు.
ఏపి చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే రజనీ అయితే ప్రచారమే లక్ష్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గావున్నారు. వీడియో సందేశాలు ఇవ్వడం, ఫొటో స్టిల్స్ విషయంలో సినిమా వారికి ఏమాత్రం తగ్గకుండా యాక్టర్‌లతో పోటీ పడుతున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి ఆమె ప్రత్యేక వీడియో, ఫొటో షూట్ చేశారు. సినిమా నటుల్ని తలపించేలా షూటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి వీడియోలో కనిపించారు. కరోనా సందేశం ఇచ్చేటప్పుడు టీవీ యాంకర్‌లా నటించారు. టీవీలో వార్తలు చదివినట్లు కరోనా సందేశం, రంజాన్ సందేశాన్ని నియోజకవర్గ ప్రజలకు వినిపించారు రజనక్కా.
ఇక రోజక్కా చేసే సందడీ అంత ఇంత కాదు. ఎమ్మెల్యే రోజా కీర్తి ప్రతిష్టలు కూడా కరోనా వైరస్ తో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో తన నియోజక వర్గంలో మాత్రం ఓ గ్రామంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపించదనే కారణంలో ఎమ్మెల్యే రోజాకు పుష్పాభిషేకం చేసారు గ్రామ ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న ఆంక్షలు ఉన్నప్పటికి, సమూహాలుగా ప్రజలు వీధుల్లోకి రావొద్దన్ని నిబంధనలు అమలులో ఉన్నప్పటికి రోజా అంశంలో అవన్నీ బలాదూర్ గా మారిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ఓ బోరుబావి ప్రారంభ కార్యక్రమంలో.. స్థానికులు రోజాపై పూలు జల్లి ఘనస్వాగతం పలికిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బోరుబావి ప్రారంభానికి ఆహ్వానించడంతో నేను వెళ్లా. అయితే వారు పూలు చల్లుతారని ఊహించలేదు. దీనిపై విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు నేను భయపడబోను. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానంటూ రోజాక్క హెచ్చరించింది.
కరోనా విపత్కరకాలంలో నేతలు ప్రజలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడుతున్నారు. మహిళ నేతలు సైతం ఇంటి నాలుగు గోడల నుంచి బయటికి వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని జనం చెప్పుకుంటున్నారట!