8 కోట్ల భూ వివాదానికి 40 కోట్ల సుపారీయా? పెద్దలను తప్పించే ప్రయత్నమన్న రఘురామ..
posted on Nov 16, 2021 7:54AM
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం స్పష్టించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రకంపనలు రేపుతోంది. దస్తగిరి వాంగూల్మంలో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు ఉండటంతో.. హత్య వేనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలు, దస్తగిరి వాంగ్మూలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. దస్తగిరి కన్పెషన్ స్టేట్ మెంట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని అన్నారు. భూ వివాదాల వల్లనే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోందని, ఇది కేసును తప్పుదోవ పట్టించడానికేనన్నది అర్థమవుతుందని రఘురామ కృష్ణరాజు అన్నారు. బెంగళూరు భూ వివాదానికి, వైఎస్ వివేకా హత్యకు ముడిపెడుతున్నారని అన్నారు.
8 కోట్ల భూ వివాదానికి 40 కోట్ల సుపారీ ఇస్తారా అని రఘురామ రాజు అనుమానం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదని, నిజాలు బయటకు తీసుకు రావాల్సిన బాధ్యత సీబీఐదేనని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. 8 కోట్ల భూవివాదంలో 40 కోట్ల సుపారీని ఎర్రగంగిరెడ్డి ఎలా ఇస్తారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఈ హత్య వెనక అసలు నిందితులు ఎవరో బయటకు రావాలని రఘురామ డిమాండ్ చేశారు.